ఒలింపిక్స్ లో మద్యంపై నిషేధం

Telugu Lo Computer
0


ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానున్న ఈ మహాక్రీడా సంగ్రామంకు టోక్యో వేదికగా నిలుస్తోంది. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఈ మాయదారి మహమ్మారి క్రీడా గ్రామంకు పాకింది. ఇప్పటికే కొందరు క్రీడాకారులు కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఒలింపిక్ విలేజ్‌కు దూరంగా ఉన్న హోటల్స్‌లో వీరు ఐసొలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఒలింపిక్స్ నిర్వాహకులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గేమ్స్ జరిగే వేదికల వద్ద మద్యపానంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గేమ్స్ జరిగే వేదికల వద్దే కాదు, మీడియా ప్రతినిధులకు, ఒలింపిక్స్ స్పాన్సరర్స్‌ బస చేసేందుకు కేటాయించిన హోటల్స్‌లో కూడా మద్యం విక్రయించడం కానీ సర్వ్ చేయడం చేయకూడదని నిర్వాహకులు స్పష్టం చేశారు.ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. క్రీడాగ్రామం వద్ద లేదా గేమ్స్ జరిగే వెన్యూ వద్ద మద్యం విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే విషయాన్ని గత నెలలో ఒలింపిక్ నిర్వహణ సమావేశంలో నిర్వాహక కమిటీ ప్రెసిడెంట్ సీకో హషిమోటో కమిటీ ముందు ప్రస్తావించారు. దీనిపై కమిటీ చర్చించి ఇందుకు నో చెప్పింది. ఇదిలా ఉంటే టోక్యోలో కొద్ది రోజుల క్రితమే కోవిడ్ ఆంక్షలపై కాస్త సడలింపు ఇచ్చారు. అయితే మద్యం క్రయవిక్రయాలపై మాత్రం ఆంక్షలు సడలించలేదు. ఇప్పటికే కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఈ మెగా ఈవెంట్ సూపర్ స్ప్రెడర్‌గా మారగలదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇప్పటికే పలు విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మద్యం పై నిషేధం విధించాలని నిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది.  టోక్యో గేమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టోక్యో నగరం మొత్తానికి పలు ఆంక్షలు విధించారు. ఇందులలో భాగంగానే మద్యం విక్రయాలపై నిషేధం విధించాలని నిర్వాహకులు భావించారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే జర్నలిస్టులకు మద్యం పై నిషేధం విధించామంటూ చాలా స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేశామని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్పారు. ఎవరైనా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జపాన్ దేశం దృష్టంతా టోక్యో ఒలింపిక్స్ గేమ్స్‌పైనే ఉంది. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మెగా ఈవెంట్‌ను ఎంత సమర్థవంతంగా నిర్వహించగలమో ప్రపంచానికి చాటి చెప్పాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. భద్రతాపరంగా కూడా గట్టి చర్యలు చేపట్టింది జపాన్ ప్రభుత్వం. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో గేమ్స్ నిర్వహించడం సాధారణ విషయం కాదని , అయితే కచ్చితంగా ఇందులో విజయం సాధిస్తామని జపాన్ ప్రభుత్వం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)