ఎలాంటి ఆధారాలు లేవు !

Telugu Lo Computer
0


చైనాలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలను నిర్ధరించే శాస్త్రీయ ఆధారాలేవీ లేవని అంతర్జాతీయ నిపుణుల బృందమొకటి పేర్కొంది. ఈ వైరస్‌ ప్రకృతిసిద్ధంగానే ఆవిర్భవించిందని అనేక అధ్యయనాలు గట్టిగా సూచిస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు వారు ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్‌'లో ఒక కథనం రాశారు.  ఈ బృందంలో దాదాపు పాతిక మంది జీవశాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, అంటువ్యాధుల నిపుణులు, వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు, జంతువైద్య పరిశోధకులు ఉన్నారు. గత ఏడాది కూడా ఇదే బృందం.. 'ల్యాబ్‌ లీక్‌' ఆరోపణలను కుట్రగా కొట్టిపారేసింది. కరోనా మొదటి కేసు వెలుగు చూసిన చైనాలోని వుహాన్‌లో సదరు వైరాలజీ ల్యాబ్‌ ఉంది. అందువల్ల అక్కడి నుంచి వైరస్‌ లీకై ఉండొచ్చన్న వాదన వినపడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మూలాలపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలని అనేక దేశాల నుంచి డిమాండ్లు పెరిగాయి. "ఆరోపణలు, ఊహాగానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గబ్బిలాల నుంచి మానవుల్లోకి ఈ వైరస్‌ వచ్చిన తీరుపై నిష్పాక్షిక విశ్లేషణకు అవి దోహదపడబోవు. భవిష్యత్‌లో మహమ్మారులు చెలరేగకుండా నివారించడానికీ అలాంటి ఊహాగానాలు సాయపడబోవు" అని అంతర్జాతీయ నిపుణులు తమ కథనంలో పేర్కొన్నారు. కొత్త వైరస్‌లు ఎక్కడైనా ఉత్పన్నం కావొచ్చని చెప్పారు. అందువల్ల మాటల యుద్ధానికి స్వస్తి పలికి, తదుపరి మహమ్మారులను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉన్నామా అన్నదానిపై శాస్త్రీయ విశ్లేషణకు పూనుకోవాలని సూచించారు. అదే సమయంలో ఈ వైరస్‌ మూలాలపై శాస్త్రీయ విచారణకు వస్తున్న డిమాండ్లను స్వాగతించారు. చైనా నిపుణులతో కలిసి చేసిన ప్రారంభ దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ భాగస్వాములు సిద్ధపడాలన్నారు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన డబ్ల్యూహెచ్‌వో నివేదికను ముగింపుగా కాకుండా ఆరంభంగానే చూడాలని కోరారు. కరోనా వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీకైందని నాటి నివేదిక పేర్కొంది. అయితే ఆ దర్యాప్తు తీరును అనేక దేశాలు ప్రశ్నించాయి. మరింత పారదర్శకంగా ఇది సాగాలని కోరాయి. అయితే ఏళ్ల తరబడి క్షేత్ర, లేబొరేటరీ స్థాయి అధ్యయనాల ద్వారానే ఒక హేతుబద్ధ, నిష్పాక్షిక నిర్ధారణకు రావడానికి వీలవుతుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు లాన్సెట్‌లో పేర్కొన్నారు. ఈ నిపుణుల్లో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలవారు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)