పీలా కాశీ మల్లికార్జునరావు

Telugu Lo Computer
0


 తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు.ఆయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి. లేడీస్ టైలర్ లో బట్టల సత్తిగాడుగా నటించిన ఆయనకు అదే పేరు నిక్ నేమ్ అయింది. 57 సంవత్సరాల వయస్సులో మంగళవారం 24 జూన్, 2008 ఉదయం 10.30 ని.లకు రక్త కేన్సర్‌ (లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.

తొలి జీవితం 

భమిడిపాటి రాధాకృష్ణ రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయె. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపునిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు. 

సినీ ప్రస్థానం 

దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.

వంశీ మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్‌ టైలర్‌'లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. ఏప్రిల్‌ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు, హలో బ్రదర్‌, ఆలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య (2001) లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)