23 కూరలు... ఇంకాస్త ఆప్యాయత! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 23 June 2021

23 కూరలు... ఇంకాస్త ఆప్యాయత!


భోజనంలోని రుచంతా.. బహుశా వడ్డించే వాళ్ల చేతుల్లోనే ఉంటుందేమో! అందుకే.. నాగన్న కొసరి కొసరి వడ్డించే భోజనంలోని రుచి ఏ స్టార్‌ హోటల్‌కీ¨ రాదు అంటారు అక్కడ తిన్న సామాన్యులు, ప్రముఖులు కూడా! ఖమ్మం జిల్లా కూసుమంచిలోని నాగన్న హోటల్‌ అతని వడ్డనకే కాదు.. 23 రకాల వంటకాలున్న రుచికరమైన భోజనానికీ ప్రసిద్ది...

ఇంట్లో అయితే అన్నం, పప్పు, సాంబారు, పెరుగు... బస్‌. ఏదైనా హోటల్‌కు వెళితే మరో రెండు కూరలు అదనంగా వడ్డిస్తారు. రూ.100కు తగ్గకుండా వసూలు చేస్తారు. నగరాల్లో, స్టార్‌ హోటళ్లలో అయితే వేలల్లోనే ఉంటుంది బిల్లు. కానీ ఈ వ్యాపార ఫార్మూలాలేవి పట్టన్నట్టుగా ఉంటుంది... ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్న ‘నాగన్న’ హోటల్‌. ఎప్పుడూ 23 రకాల పదార్థాలు తగ్గకుండా విస్తరి నిండుగా వంటకాలు.... అవి ఇంకా తినకముందే కడుపు నింపేసే యజమాని నాగన్న ఆప్యాయత. అందుకే ఈ భోజనానికి దర్శకుడు వంశీ దగ్గర నుంచి రాఘవేంద్రరావు, తనికెళ్ల భరణి, రవితేజ, వేణు వంటి వారు ఫిదా అయిపోయారు. చంద్రబాబు అయితే నాగన్న చిక్కగా పెట్టే టీ ఇష్టంగా తాగి వెళ్లారట.
పెరుగు ప్రత్యేకం..
పప్పు, బెండకాయ, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, సొరకాయ, క్యారెట్, క్యాలీఫ్లవర్‌, బీట్రూట్, పాలకూర, తోటకూర, బచ్చలికూర, గోంగూర కూరలతోపాటూ.. పలు రకాల చట్నీలు, ఊరగాయలు, సాంబారు, పెరుగు, అప్పడం ఉంటాయి. ఇన్ని వడ్డిస్తే ధర వందల్లో ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ కాదు... రూ.80లు మాత్రమే. హోటల్‌ యజమాని బెల్లంకొండ నాగన్నే స్వయంగా భోజనం వడ్డిస్తారు. ఇన్ని కూరలు, ఆప్యాయత ఒక ఎత్తైతే.. అన్నంతో ఇచ్చే పెరుగు ఆయన స్వయంగా పెంచిన పాడి గేదెల పాలతో తోడు పెట్టింది. ఆ గడ్డ పెరుగు ఒక్కటీ వడ్డించినా చాలు అనిపిస్తుందంటారు భోజనప్రియులు.
28 సంవత్సరాలుగా... నాగన్నది వ్యవసాయ కుటుంబం. చదువు అబ్బలేదు. కానీ 28 సంవత్సరాలుగా హోటల్‌ నిర్వహణతో కోట్ల రూపాయలు కాదు కానీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారీయన. మొదట్లో రూ.25కి... 20 కూరలతో భోజనం వడ్డించే వారు. ‘నేను ఏనాడు లాభ నష్టాల గురించి ఆలోచించలేదు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటినా సరే ఇన్ని కూరలూ వడ్డిస్తాను. తక్కువ ధరలకు లభ్యమైనా.. ఇంతే. అలా చేయడం వల్ల నాకు ఆత్మసంతృప్తి లభిస్తోంది. నా శ్రమ వృథా కాలేదులెండి. ఒక్కసారి ఇక్కడ తిన్నవాళ్లు.. మళ్లీ ఇక్కడికే వస్తారు. లేదంటే తెలిసిన వాళ్లను పంపిస్తారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. అబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. నా భార్య మణెమ్మ కనీసం విసుక్కున్నా నేనీ పని చేయలేను’ అంటారు నాగన్న. ఈ హోటల్‌ ఖమ్మం- హైదరాబాద్‌ రహదార్లో కూసుమంచి కూడలి ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. కార్లల్లో ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వెళ్లే వారంతా ఈ హోటల్లో భోజనం చేస్తుంటారు.

No comments:

Post a Comment

Post Top Ad