అ రు గు!

Telugu Lo Computer
0



మాది ఒక పెంకుటిల్లు. ఇల్లు చిన్నదే. బయట ఇంటి వెడల్పు కన్నా కాస్త తక్కువగా అరుగు ఉండేది. పగలు రాత్రి అని లేకుండా ఆ అరుగు కళకళలాడుతుండేది. ఇంగ్లీషువాడి రాజ్యాంగంలా ఆ అరుగుకి కొన్ని నియమాలు ఉన్నై. అంటే ఎవరూ చెప్పనవసరం లేకుండా, అందరూ పాటించేవి.

మొదటిది. ఇంట్లోవారు మాత్రమే వాడుకునే సమయాలు. బయటివాళ్ళలో కొంత పై తరగతి వాళ్ళు కూడా కూర్చునే సమయాలు. ఎవరైనా వచ్చి కూర్చునే సమయాలు. కావిళ్ళతో కూరలు తెచ్చి అమ్ముకునే సమయాలు పొద్దున మాత్రం. సాయంత్రాలు గాజుల మలారం, రిబ్బన్లు, బొట్లు, వంటి స్త్రీల డిపార్ట్మెంటువారి సమయం. బొత్తిగా ఆగంతకులు పడుకునే రాత్రి సమయాలు. ఈ వాడుకునే సమయాల నియమాలు కాకుండా ఇతర నియమాలు కూడా ఉన్నై. చాలా కఠినంగా అమలు చేసేది, ఎవరైనా సరే, "మందు" పుచ్చుకుని ఎవరూ రాకూడదు. పెద్దమనుషులు తప్ప మరెవ్వరూ చుట్ట కాల్చకూడదు. ఆ పెద్దమనుషులైనా అరుగుమీంచి ఉమ్మరాదు.దేశ రాష్ట్ర రాజకీయాలు యధేచ్చగా మాట్లాడుకోవచ్చు. ఊరి రాజీయాలు మాత్రం నిషిద్ధం సినిమా కబుర్లు ఒక్క రామారావుని పొగిడే కబుర్లు మాత్రమే మాట్కాడవచ్చు. నేను కొందరితో కలిసి పేకాడుతాను. అంటే నెనున్నప్పుడు మాత్రమే పేకాట. అదీ నా ఇష్టం వచ్చినవారికే ప్రవేశం. అమ్మవారి ఊరేగింపులు, గరగలు, వగైరా, ఉన్నప్పుడు ఇంట్లోవాళ్ళు అరుగు మీద నిలబడి చూస్తారు కాబట్టి, చిన్న పిల్లలు తప్ప మరెవ్వరు బయటివారు అరుగెక్క కూడదు. ఇంకో నిర్వచనానికి లొంగని నియమం, మామూలుగా మాట్లాడేడప్పుడు కావలసిన "ధ్వనికి" ఉపయోగించే బూతు మాటలు రావచ్చు కానీ అసలు "బూతులు" పనికిరావు.
కారణాలు ఏమైనా, కొందరు కులం అంటారు, కొందరు అంతస్తు అంటారు, మరికొందరు దాపరికం అంటారు, మరీ దగ్గరవారు అయితే తప్ప, వచ్చినవారికందరకీ ఆ అరుగే హద్దు ఒక్క పాలేరుకి తప్ప. పొద్దున్నే స్నానపానాదులు కానిచ్చి, వచ్చి అరుగు పీది పడక కుర్చీలో కూర్చుంటాను. అప్పటికే పేపరువాడు పేపరు వేయడము, ఏ పుటకు ఆ పుట విడిచేసి వదివి అక్కడ పడెయ్యడము అయిపోయి ఉండేది. నేను అన్ని కాగితాలను పోగుచేసి, వరుస క్రమంలో బొత్తిపెట్టి చదువుతాను. కొత్త పేపరు ఒకసారి తిరగేస్తేనే, అది మళ్ళీ ఆ శుభ్రమైన మడతకు రాదు. పది మంది చేతుల్లో పడినది. లొంగుతుందా. ఉహూన్. కానీ నాకు ఇబ్బంది లేదు.
ఇల్లు ఇరుకైంది. మనుషులు ఎక్కువై కొంత, సామాన్లు పెరిగి కొంత. కొత్తగా వచ్చిన కోడలుతో బాటు ఇదివరకు లేని కొన్ని హంగులు వచ్చాయి. అంతకన్నా కొన్ని పడికట్లు వచాయి. వాషింగు మిషను ఒకటి కొత్త సామాను ఐతే, వర్షం పడుతున్నపుడు కూడా బట్టలారవేసుకోడం కొత్త పడికట్టు. ఎక్కడ? ఇంట్లో తాతలనాటి పడక కుర్చీ ఉంది. అది అందరికీ కావాలి కానీ అందరూ విసుక్కోడమే కాళ్ళలో పడుతుందని. తాతయ్య బర్మా టేకుతో చేయించినది. చూస్తూ చూస్తూ ఎవర్కీ ఇవ్వ బుద్ధెయ్యదు. దానికి స్థానభ్రంశం కలిగించాలి. ఎక్కడకి? పెద్దవాడి కొడుకుని స్కూల్లో వేశారు. వాడికి అప్పుడే "ట్యూషను". ఎక్కడ?
అందరి కళ్ళూ పచ్చగా కళకళలూడుతున్న నా అరుగు మీదే పడ్డది. అ రాత్రి మా ఆవిడ నాతో అన్నది.
"పిల్లలు అరుగుకి జాఫ్రీ పెట్టిద్దామనుకుంటున్నారు. మీకు ఆ అరుగుతో ఉన్న బంధం తెలుసు కాబట్టి తటపటాయిస్తున్నారు. వాళ్ళు మట్టుకు ఏం చేస్తారు? అవసరాలు. ఇంతవరకు కోడళ్ళు కల్పించుకోలేదు. అంతవరకు మనం పెద్దవాళ్ళం రానీయకూడదు. రేపు వడ్రంగిని పిలిచి మీరే పురమాయంచండి."
నేను కళ్ళు తెరిచాను. నా ఇల్లు. ఇంటికి నేను పెద్దవాణ్ణి. అన్నీ నా ఇష్టప్రకారమే జరగాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. పిల్లలు కూడా ఎప్పుడూ అనుకున్నట్లు చూచాయిగా కూడా నాకనిపించలేదు. కానీ, ఇప్పుడు ఇతరులలో, నాకు అటువంటి భావాలు ఉన్నట్లు అనిపించవచ్చు. ఆవిడ లోతుగా ఆలోచించి గానీ మాట అనదు.
మర్నాడు వడ్రంగిని పిలిపించా. వచ్చాడు. సరిగ్గా నిండు కొలువు తీరివుంది. అర్థమైంది కొలతలు అవీ తీస్తుంటే. నిశ్శబ్దం ఆవరించింది. కొలతలు తీసుకున్నాడు. రేపు కలపను దింపిస్తా బాబయ్యా అని వెళ్ళిపోయాడు.
నిశ్శబ్దం అటాగే కొనసాగింది. నేను తెచ్చిపెట్టుకున్న మామూలు స్వరంతో నాలుగు మాటలు మాట్లాడాను.నాకే పేలవంగా అనిపించింది. నెమ్మదిగా ఒకరూ ఒకరూ జారుకున్నారు.
మర్నాడు స్నానం అదీ చేసి బయటకు వచ్చి కూర్చుని పేపరు వంక చూశా. మడత విప్పలేదు. ఇంకా కలపా రాలేదు. జాఫ్రీ రాలేదు. మనుషులు మాయమయ్యారు. మాటలేముంటాయి మనుషులు లేకపోతే. ఇక ఏ నియమాలు అక్కర్లేదు. నేను ఒక్కణ్ణేగా!

Post a Comment

0Comments

Post a Comment (0)