హాల్ మార్కింగ్ - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో  బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో; తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ అమల్లోకి వచ్చినట్లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) వెల్లడించింది. ఈ నేపథ్యంలో మీరు కొనుగోలు చేయబోయే బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ తప్పనిసరి. అయితే, హాల్‌మార్క్ గుర్తు అస‌లైన‌దా కాదా అని ప‌రిశీలించ‌డం కూడా చాలా ముఖ్యం. కొన్ని నగల దుకాణాలు త‌మ సొంతంగా హాల్‌మార్క్‌ను ముద్రించే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు స‌మ‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి.

హాల్‌మార్క్‌ గుర్తులో మూడు విషయాలను ముందుగా తనిఖీ చేయాలి. త్రిభుజాకారంలో ఉన్న‌ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) గుర్తు ఉందో లేదో చూసుకోవాలి. స్వచ్ఛతను సూచించే క్యారేటేజ్‌ (22K915) ఉందో లేదో చూడాలి. దీంతోపాటు ఏహెచ్‌సీ (అస్సేయింగ్ హాల్‌మార్కింగ్ కేంద్రం) గుర్తు ఉందో లేదో గమనించాలి. బీఐఎస్ లైసెన్స్ చూపించాలని కూడా దుకాణదారుడిని అడగొచ్చు. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం.. ఆభరణాల లైసెన్స్‌ను కొనుగోలుదారుల‌కు చూపించాల్సి ఉంటుంది. అందులో ఉన్న చిరునామాలోనే షాప్ ఉందో లేదో గమనించండి. బిల్లు తీసుకునేటప్పుడు హాల్‌మార్కింగ్ ఛార్జీలను కూడా పేర్కొనమని అడగొచ్చు. హాల్‌మార్క్ చేసిన వస్తువుకు నగల దుకాణదారుడి నుంచి ఏహెచ్‌సీలు రూ.35 వసూలు చేస్తారు. మీరు సొంతంగా కూడా ఏహెచ్‌సీ వ‌ద్ద‌ ఆభరణాలను తనిఖీ చేసుకోవచ్చు. బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో ఏహెచ్‌సీల జాబితాను చూడొచ్చు. స‌స్పెండ్ చేసిన ఏహెచ్‌సీ, లైసెన్స్ ర‌ద్దు చేసిన వాటి వివ‌రాలు కూడా ఇక్క‌డ ల‌భిస్తాయి. కొంత మొత్తం ఛార్జీల‌తో వినియోగ‌దారులు త‌మ ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌ను తెలుసుకునేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పరీక్షించిన తర్వాత ఆభరణాల స్వచ్ఛతను సూచిస్తూ నివేదికను ఏహెచ్‌సీ జారీ చేస్తుంది. ఆభరణాలు తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలితే అంత‌కుముందు ధ్రువీకరించినందుకు సదరు ఏహెచ్‌సీ వినియోగదారు ఫీజును తిరిగి చెల్లించాలి. స్వచ్ఛత లేక‌పోతే మీకు విక్ర‌యించిన దుకాణ‌దారుని వద్దకు వెళ్లి ఆ ప‌త్రాల‌తో ప్ర‌శ్నించేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నగల వ్యాపారి పరిహారం కూడా చెల్లించాల్సి వ‌స్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)