ఆసరా !

Telugu Lo Computer
0


"సత్య ఇలా రా,కాసిన్ని మంచి నీళ్ళు తీసుకురా ఇక్కడ ఎవరో పడిపోయారు"అంటూ కేక వేశారు వెంకన్న గారు,"అయ్యయ్యో ఎండ కి సొమ్మసిల్లి వుంటారు "అంటూ ఒక లోటా నీరు అందించింది సత్య ,మొహాన కాస్త నీరు కొట్టి లోపలికి తీసుకు వచ్చి ఒక గ్లాస్ లో కాస్త మజ్జిగ ఇచ్చి ,ఒంటి మీద చెయ్యి వేసి చూసారు వెంకన్న గారు , అతనికి ఒక ముప్పై ఏళ్ల వయసు ఉంటుంది,"ఒళ్ళు కాలి పోతోంది ,దగ్గర్లో ఆస్పత్రులు కూడా లేవు నాయనా నీ పేరేంటి మీ వాళ్ళు ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు నీకు ఇలా ఉంది అని ఫోన్ చేసి చెప్తాను వచ్చి నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్తారు",అన్నాడు

"తల తిరిగిపోతోంది బాబాయ్ ,మా ఇంట్లో నేను అమ్మ తప్ప ఎవరూ లేరు అమ్మ ని మొన్న పక్క ఊరు ఆసుపత్రిలో చేర్పించా ,ఆవిడకి కాస్త అన్నం పెడదాము అంటే బయట ఏమి దొరకక ఇంటికి వెళ్లి కాస్త వండుకుని పట్టుకు వెల్దాము అని వస్తూ కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను","అమ్మ ఎక్కడ వున్నారు ఏ హాస్పిటల్ "అని అడిగారు వెంకన్న "అయ్యవరం ప్రభుత్వ ఆసుపత్రిలో"అన్నాడు ఆ వ్యక్తి పేరు ఇతర వివరాలు తెలుసుకుని మెల్లిగా సత్య కేసి చూసారు,ఆయన మనసెరిగిన ఇల్లాలు ఆవిడ ఒక డబ్బా లో అన్నము,పొద్దున్న కాచిన పప్పుచారు,మజ్జిగ ఒక నిమ్మకాయ ఊరగాయ బద్ధ కట్టి ఒక గాజు సీసా లో నీళ్లు ఒక బుట్ట లో పెట్టి ఇచ్చింది పైన పెరట్లో నుండి ఒక రెండు జామకాయలు,ఓ నాలుగు అరటిపళ్ళు ఇచ్చింది ,"ఇతన్ని నేను చూస్తాను ఆ ఒదిన గారికి మీరు ఇచ్చి రండి"అంటూ బండి తాళం ఇచ్చింది ,వెంకన్నగారు సత్య గారు రిటైర్డ్ దంపతులు,ఉన్న రెండు ఎకరాల పొలం లో పంట పండించుకుని, దగ్గర్లో ఉన్న ఊరిలో అమ్మి,చుట్టూ వున్న పిల్లలకు చదువు చెప్తూ ,తన పెన్షన్ ,పంట మీద వచ్చే కొద్దిపాటి ఆదాయం తో సుఖంగా కాలం గడుపుతున్నారు, కడుపున పుట్టిన ఒక్క కూతురు విదేశాల్లో ఉంది వీరు అక్కడికి వెళ్ళరు, ఆమె కి వచ్చే పరిస్థితి లేదు అని కచ్చితంగా చెప్పేసింది,అందువల్ల ఆ విషయం లో ఇంకో మాటకి తావు ఇవ్వలేదు వెంకన్న గారు.
అదొక పాత స్కూటర్ కానీ పాపం వెంకన్న గారిని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, ఆయన అవకాశం ఉన్నంత వరకు దానిని వాడరు ,నడిచో సైకిల్ మీదో వెళ్తారు.ఇప్పుడు అత్యవసరం గనక బండి మీద వెళ్లారు,అక్కడ ఆ ఆసుపత్రిలో అంత గందరగోళం గా ఉంది కరోనా పేషెంట్స్ విభాగానికి రాకపోకలు కాస్త ఆపుతున్నారు,మెల్లిగా అన్నపూర్ణమ్మ గారి వార్డ్ లో కి వెళ్లి చూస్తే ఆవిడ నీరసంగా పడిపోతున్నారు,గబగబా నర్స్ ని పిలిచి ఆవిడని కూర్చోపెట్టి ,తాను తీసుకువెళ్లిన ఆహారం ఆవిడకి తినిపించి ఆవిడ ని చూసి నవ్వారు ,"మీరు ఎవరు నాయనా మా సత్యం ఏడి ","అమ్మ అబ్బాయి మా ఇంట్లో ఒక పని కోసం వున్నాడు,మీకు భోజనం ఆలస్యం అవుతోంది అని నేను వచ్చాను,మీరు మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోండి "అని అక్కడి నుండి బయటకు వచ్చారు వెంకన్నగారు.
ఆ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వల్ల కనీసం తిండి తినలేక,మందులు కోసం తాపత్రయ పడుతున్న వారిని చూసిన వెంకన్న గారికి చాల భయం వేసింది,తాను ఇంత కాలం చుట్టూ వున్న వారికి దూరంగా వున్నాను అనే ఆలోచన నిలవనివ్వట్లేదు వెంకన్న ని.మెల్లిగా ఇంట్లోకి వచ్చి పరధ్యానంగా కూర్చున్నాడు,"ఏమైందండి ఆవిడ ఎలా ఉన్నారు "అంటూ ఆగి అడిగింది సత్య,"అబ్బే ఆవిడ బానే వున్నారు,కాకపోతే చాలా నీరసంగా వున్నారు,నర్సమ్మ సాయం తో అన్నం పెట్టాను ,ఆవిడ మెల్లిగా తేరుకుంటారు లే ,కాకపోతే అక్కడ తిండి లేక కొన్నుకుంనేందుకు బయట అన్ని దొరకట్లేదు ఇలాంటి వారికి ఏమి చెయ్యాలో తెలియక అయోమయంలో పడిపోయి చూస్తున్న,వాళ్ళకి మనం ఏమి సాయం చేయలేమా"అంటూ చూసాడు వెంకన్న.
"ఎందుకు అండి మీరు ఆలోచిస్తున్నారు ,దీనికి నా దగ్గర మీ అమ్మ గారి చిట్కా ఉంది" అంటూ ఆయన చెయ్యి పుచ్చుకుని వంటింట్లో ఒక ములగా ఉన్న కుండ దగ్గరకు తీసుకువెళ్లారు సత్యమ్మ గారు, "ఇదేమిటి ఎప్పుడో మనం దశాబ్దాల క్రితం వదిలేసిన ఈ కుండ మనకి పరిష్కారం ఎలా "అన్నారు అయోమయంగా.
" మీరు ఇది కాస్త రుచి చూడండి" ,అంటూ ఒక లోటా అందించారు,"అబ్బా ఎంత హాయిగా ఉంది, ఒక్కసారి అమ్మ గుర్తొచ్చింది "అంటూ కళ్ళు ఒత్తుకున్నారు వెంకన్న
"అదే కదా నేను చెప్పేది ఇప్పుడు వేసవి కాలం అందులో బయట రోగాల బారిన పడినవారికి మనం తిండి అందించే స్థోమత ఓపిక మనకి ఉండదు,కానీ ఈ కుండ లో గంజి ,అన్నం వేసి ఉప్పు ,జీలకర్ర పొడి ,మజ్జిగ వేసి తయారు చేసిన "తరవాణి" ఎంతో శక్తి ని ఇస్తుంది అని మీ అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు,అది చేసి ఆ ఆసుపత్రిలో రోగులకు,వారికి సాయం చేసేవారికి అందిద్దాం"అని వీరు అనుకుంటూ ఉండగా వెనక నుండి వచ్చిన కుర్రాడు "పిన్ని ఏమి అనుకోక పోతే నాకు ఒక లోటా ఇవ్వండి","అయ్యో దానిదేముంది ,హాయిగా తాగు" అంటూ ఇచ్చారు సత్య .
"పిన్ని ఈ తరవాణి మీ ఆలోచన అంత కమ్మగా ఉంది,మీ ఆలోచన ఇప్పుడే విన్న చాలా సరి అయినది ,మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు సాయం చేస్తా,ఇవి సర్ది ఇవ్వడానికి డబ్బాలు నేను తెస్తాను,నేను బాబాయ్ వెళ్లి ఇచ్చి వస్తాము ,ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ పాటి తిండి కూడా దొరకక యాతన పడే వాళ్ళకి ఇది అమృతమే".
"అది కాదు బాబు,ఇవాళ జనాలు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కదా,అందుకే తీసుకుని పడేస్తే ఊరికే పోతుంది కదా"అన్నారు వెంకన్న.
"మీకు ఆ భయం వద్దు బాబాయ్ నేను ,మీరు రేపు ఇచ్చి వద్దాము, వాళ్ళు ఎలా తీసుకుంటారో చూసి ఆ పైన ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం, సాయంత్రం నేను డబ్బాలు తెస్తాను"అంటూ అక్కడి నుండి వెళ్ళాడు సత్యం.
సాయంత్రం తాను వస్తూ తన స్నేహితుడిని తీసుకువచ్చాడు,వెంకన్న గారు కూడా తమ పక్కింటి కుర్రాడు రాజు ని పిలిచారు,అందరు సత్య గారికి సాయం చేశారు,మర్నాడు పొద్దున్నే డబ్బాల్లో సర్దిన "తరవాణి" ని డజను డజను ఒక్కో సంచి లో పెట్టుకుని ,మాస్కులు, గ్లౌజులు వేసుకుని వెళ్లి అవసరం అనుకున్న ప్రతి ఒక్కరికి పంచారు,అరగంట లో అందరూ హాయిగా తాగి "పెద్దాయన చల్లగా వుండు,బాబు చాలా థాంక్స్ మా ఆకలి తీర్చావు లాంటి మాటలు విన్న వాళ్ళ నలుగురికి మనసు ఆనందం తో నిండి పోయింది ,ఇంతలో ఒక చిన్న బాబు ఒక ఆరు ఏడు ఏళ్ళు వుంటాయేమో వెంకన్న దగ్గరకు వచ్చి "తాత నిన్న మొన్న ఏమి తినలేదు,అయ్య ఏమో కూలి కి పోలేదు,ఇప్పుడు ఇక్కడ పడుకున్నాడు,జ్వరం అంట ,ఇప్పుడు మీరు ఇచ్చింది భలే బావుంది ,రేపు కూడా ఇస్తారా"అంటూ వచ్చి చెయ్యి పట్టుకున్నాడు.
ఒక్కసారి అక్కడ ఉన్న నలుగురికి కళ్ళ లో నీళ్లు తిరిగాయి,"మరి రాత్రి కి ఎలా రా నాన్న ,ఇదిగో ఈ పళ్ళు తీసుకో "అన్నాడు వెంకన్న ,"తాత ఒక్క నిముషం అంటూ లోపలికి ఒక మంచం మీద పడుకున్న ఒక పాప కి ఆ పళ్ళు ఇచ్చేసి వచ్చాడు""అదేంటి రా నిన్ను తినమని ఇస్తే ఆ పాప కి ఇచ్చావు"అని అడిగారు వెంకన్న "అది కాదు తాత నిన్న నుండి ఆ పాప ఏమి తినలేదు, వాళ్ళ అమ్మ గంజి ఇచ్చింది,పాపం తను తినలేక పోయింది.అందుకే అరటిపళ్ళు తియ్యగా తింటుంది అని ఇచ్చాను".
"మరి నీకో "అంటే "నేను మీరు ఇచ్చిన తరవాణి తాగాను కదా రేపటి దాకా సరిపోతుంది"అని చెప్పాడు.
అంత ఆకలి ,కష్టం వున్నప్పటికీ అంత చిన్న ప్రాయం తోటి వాడి ఆకలి అర్ధం చేసుకున్న వాడి పెద్ద మనసుకి కరిగిపోయారు వెంకన్న గారు.
ఆ స్ఫూర్తి తో వెంకన్న గారు,సత్యం" ఆసరా"అనే సేవ సంస్థ మొదలు పెట్టి అవకాశం ఉన్నంత మేర తమ చుట్టూ అన్నార్తుల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)