బగ్ పట్టాడు.... 22 లక్షలు కొట్టాడు !

Telugu Lo Computer
0



సోలాపూర్‌కు చెందిన మయూర్‌ ఫర్తడే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ  లోపాన్ని కనుగొన్నాడు. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మయూర్‌ ఇన్‌స్టాలో సైబర్‌ నేరగాళ్లు ఎలా అవతలి వ్యక్తుల పోస్టులను చూడగలరో పేర్కొన్నాడు. ఈ బగ్‌ ద్వారా  ప్రైవేట్‌ ఇన్‌స్టా ఖాతాల ఫొటోలు, ఆర్కివ్డ్‌ పోస్టులు, స్టోరీలు, రీల్స్‌ తదితర వివరాలను పొందేందుకు అవకాశం ఉందని గుర్తించాడు. వ్యక్తుల పోస్టుకు సంబంధించిన మీడియా ఐడీ ద్వారా ఈ వివరాలను పొందొచ్చని కనుగొన్నాడు. మీడియా ఐడీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన డెవలపర్‌ లైబ్రరీలోని గ్రాఫ్‌క్యూఎల్‌ అనే టూల్‌ను ఉపయోగించి బ్రూట్‌ ఫోర్స్‌డ్‌ మీడియా ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా సదరు పోస్ట్‌ తాలూకా లింక్‌, పోస్ట్‌ వివరాలు పొందొచ్చన్న విషయాన్ని గుర్తించాడు. 

ఇదే విషయాన్ని ఏప్రిల్ 16న ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకెళ్లాడు మయూర్‌. అందుకు ఏప్రిల్‌ 19న బదులిచ్చిన ఫేస్‌బుక్‌  ఆ లోపాన్ని సవరించుకుంది. ప్రమాదకరమైన బగ్‌ను కనుగొన్నందుకు గానూ జూన్‌ 15న ₹22 లక్షలను మయూర్‌కు అందజేసింది. బగ్‌ను కనుగొన్నందుకు గానూ ధన్యవాదాలు చెప్పడమే కాకుండా భవిష్యత్‌లోనూ ఇలాంటి లోపాలుంటే గుర్తించి పంపించాలని కోరుతూ లేఖ రాసింది. మరోవైపు తన బగ్‌ బౌంటీని ఇకపైనా కొనసాగిస్తానని చెప్తున్నాడు మయూర్‌. అయితే, దాన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగంగా భావిస్తానని, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అవ్వాలన్నదే తన లక్ష్యమని మయూర్‌ అన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)