అదిగో పులి ! ఇదిగో తోక !

Telugu Lo Computer
0

 

కృష్ణపట్నం లో ఆనందయ్య ఇచ్చిన నాటు మందు తీసుకున్న వారిలో ఆరోగ్య పరిస్థితి విషమించి నెల్లూరు ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య బుధవారం (మే 26) నాటికి 84 కి చేరింది. వారిలో ఆరుగురు ఐసియు లో వున్నారు. ఈ రోజు మరో ఇద్దరు మృతి చెందారు. మంగళవారం ఆరుగురు మరణించారని, మరో 36 మంది తీవ్రంగా బాధ పడుతున్నారని వార్త ఈ రోజు ప్రజాశక్తి ప్రచురించింది. స్పష్టమైన సమాచారం ఆధారంగానే ప్రజాశక్తి వార్తలు ప్రచురిస్తుంది తప్ప సెన్సేషన్‌ కోసమో, చౌకబారు పబ్లిసిటీ కోసమో కాదన్నది రాష్ట్రమంతటా తెలుసు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు గాని, మరణాలు గాని తగ్గుముఖం పడుతున్న దాఖలాలు లేవు. ఇదొక అంతర్జాతీయ విపత్తు. గత ఏడాది పైబడి ప్రపంచం అంతా కోవిడ్‌ మహమ్మారిపై ఎడతెగని పోరు సల్పుతోంది. ఇటువంటి అసాధారణమైన వైరస్‌ విసిరిన సవాలును దీటుగా ఎదుర్కొని ఓడించడానికి ప్రపంచం మొత్తం మీద ఉన్న వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు అందరూ తమ శక్తియుక్తులను కలబోసుకోవాలి. ప్రభుత్వాలు అన్ని విధాలా అండదండలివ్వాలి. వ్యక్తుల లాభాపేక్షకు, స్వార్ధానికి తావు ఉండరాదు. మన దేశంలోనే కోవిడ్‌ బారిన పడిన రోగులకు వైద్యం చేయడానికి ప్రాణాలకు తెగించి వేలాదిమంది డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది పని చేస్తున్నారు. స్వచ్ఛందంగా బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చిన సంస్థలు, వ్యక్తులు కూడా ఉన్నారు.
రెండో విడత కోవిడ్‌ ఉధృతి మొదటి విడతలోకన్నా ఎక్కువగా, స్వల్ప కాలంలో, ఎక్కువ ప్రభావం చూపింది. ఈ రెండో విడతలో ప్రజాశక్తి సిబ్బందిలో సైతం దాదాపు సగం మందికి కోవిడ్‌ సోకింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కుటుంబాలలో అదే విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌, బెడ్లు, ముఖ్యమైన మందులు దొరకని సరిస్థితి ఏర్పడింది. పరీక్ష చేయించుకుంటే రిజల్ట్‌ రావడానికే వారం పైబడి ఎదురు చూడవలసిన దుస్థితి దాపురించింది. ఇదే సందు అనుకుని ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు విచ్చలవిడి దోపిడీకి తెరతీశాయి.
తమవారిని కాపాడుకోడానికి ఆస్తులను సైతం అమ్ముకుని, బంగారం తాకట్టు పెట్టి, అప్పుల పాలై, చివరకు ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆర్థిక సహాయం కోసం దాతలను అర్ధించడానికి సిద్ధపడిన వారి ఆత్మ క్షోభ ఏ విధంగా ఉంటుందో ఊహించుకోగలం. అత్యధిక ప్రజానీకం ప్రభుత్వ నిష్క్రియా పరత్వం వల్ల అనండి, అశ్రద్ధ అనండి, ముందుచూపు లేకపోవడం వలన అనండి, ఈ రోజు కోవిడ్‌ నుండి రక్షణ కరువై నిస్సహాయంగా నిలబడిపోయారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలలో ఈ పరిస్థితి ఉంది. దానికి తోడు భయాందోళనలు పెరుగుతున్నాయి. కోవిడ్‌ నుండి రక్షణ ఇచ్చే వ్యాక్సిన్‌ అందుబాటు లోకి ఇప్పుడే వచ్చే సూచనలు లేవు.
ఈ సమయంలో ఆనందయ్య ఇచ్చే మందు కరోనాను నయం చేస్తుందన్న సమాచారం సోషల్‌ మీడియాలో రెండు వారాల నుంచీ ప్రచారం పొందింది. ఇక ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే.
వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపోచ దొరికినా ఆత్రంగా పట్టుకుని బతుకుదామని తాపత్రయ పడతాడు. అది సహజం, అయితే వరదలో చిక్కుకున్న వారిని రక్షించాల్సిన టాస్క్‌ ఫోర్స్‌ వారు అటువంటి గడ్డిపోచలతో ప్రజలను కాపాడడానికి గనుక పూనుకుంటే వారినేమంటాం ?
అదే విధంగా ఆనందయ్య మందుతో రక్షణ పొందుదామని ఆశపడే ప్రజలను మనం అర్ధం చేసుకోవచ్చు. కాని అటు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని అధికారంలో ఉండి ప్రజల ప్రాణాలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు గాని, ప్రజా ప్రతినిధులు గాని, వైద్య బృందాలు గాని చేయవలసిన పని ఏమిటి ?
ఒకవేళ ఆనందయ్య ఇస్తున్న మందు పని చేస్తోంది అని తేలితే అది ఎటువంటి వారికి, ఎంతవరకూ పని చేస్తుంది అన్నది నిపుణుల ద్వారా నిర్ధారించాలి. కరోనా నెల్లూరు జిల్లాకో, ముత్తుకూరు మండలానికో వచ్చిన సమస్య కాదు కదా. మొత్తం ప్రపంచానికే వచ్చిన సమస్య. ఆనందయ్య మందు గనుక కోవిడ్‌ ను నయం చేయడమో, కనీసం నియంత్రించడమో చేయగలిగితే...అది మొత్తం ప్రపంచానికే ఉపయోగపడుతుంది.
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించాల్సిన విషయం ఇది. ఆ తర్వాత ఏ విధంగా ఆ మందు వాడాలి అన్నది నిర్ధారించి దానిని అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి పూనుకోవాలి.
ఒక వ్యాక్సిన్‌ ను కనుగొన్నాం అని ప్రకటించాక దాని ప్రయోజకత్వాన్ని మూడు దశలలో, ఆరు నెలల పాటు పరీక్షించి, ఆ పరీక్షలో అది నిగ్గుదేలితే అప్పుడు దాని ఉత్పత్తికి అనుమతిచ్చింది ప్రభుత్వం. అంతే కాని, మేం వ్యాక్సిన్‌ కనుగొన్నాం అనగానే ప్రజలకు సరఫరా చేయమని ఆదేశించలేదు కదా? మరి ఆనందయ్య మందు విషయంలో కేవలం పది రోజుల్లో ఏవిధంగా దాని ప్రయోజకత్వం రుజువౌతుంది ?
ఇక్కడ గమనించాల్సింది కొందరు రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల పాత్ర. ఏ ఇతర మందు విషయంలోనూ వారెవరూ ఇటువంటి హడావుడి ప్రదర్శించిన దాఖలాలు లేవు. కాని ఆనందయ్య మందు విషయంలో గత వారంరోజుల్లో ఎందుకీ హడావుడి ప్రదర్శించారు ?
వెంకయ్య నాయుడు గారికి కరోనా వచ్చినప్పుడు మాత్రం ఎయిమ్స్‌లో వైద్యం చేయించుకున్నారు. ఆ విషయం ఇప్పుడు ఎవరూ ప్రస్తావించకూడదు. బహుశా మరో దేశద్రోహం కేసు అవుతుందేమో! ఉప రాష్ట్రపతి మొదలు స్థానిక నాయకుల దాకా, ప్రభుత్వ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తో సహా వ్యవహరించిన తీరు అసాధారణంగా కనపడుతోంది.
ఆనందయ్య మందు పనికిరానిదని, అది పని చేయకూడదని ప్రజాశక్తి భావించడంలేదు. ఆ మందు ప్రయోజకత్వం శాస్త్రీయంగా నిర్ధారింపబడితే, ఆ తర్వాత మాత్రమే దాని వాడకాన్ని అనుమతించాలని కోరుతోంది. తాజా సమాచారం ప్రకారం గత ఏడాది శ్రీరామనవమి నాటి నుండీ ఆనందయ్య ఈ మందు ఇస్తున్నారని తేలింది. అది పని చేసినదీ లేనిదీ ఇప్పటికీ తెలియడం లేదు. ఆనందయ్య దగ్గర మందు పుచ్చుకున్నవారి రికార్డులేవీ లేవు. వారిలో ఎందరు ముందు జాగ్రత్తగా తీసుకున్నారో, ఎందరు తగ్గిపోయాక వచ్చారో, ఎంతమంది వ్యాధి ముదిరాక వచ్చారో ఏ వివరాలూ లేవు.
గతేడాది కరోనా ఉధృతి ఏప్రిల్‌ నుండి నవంబర్‌ దాకా కొనసాగింది. కాని మొన్నమొన్నటి దాకా ఆనందయ్య మందు గురించి నెల్లూరు లోనే తెలియదు. వాస్తవంగా ఆ మందు ప్రభావం కలదే అయితే, గత ఏప్రిల్‌ నుండి గడిచిన ఏడాది కాలంలో దాని ప్రయోజకత్వాన్ని అధికారికంగానే నిర్ధారించి వుండాలి. జిల్లా అధికారులకు కనీసం దాని గురించి సమాచారం ఉండివుండాలి. అటువంటిదేమీ లేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం గత రెండు వారాలుగా సోషల్‌ మీడియాలో ఒక పథకం ప్రకారం జరిగిన ప్రచారం (ఎవరు దీని వెనుక ఉన్నారో మరి) తర్వాతే ప్రజలకు తెలిసింది.
ఇప్పుడు ఆనందయ్య మందు పేరుతో చుట్టుపక్కల ప్రభుత్వం ఆంక్షలు ఉన్నా, మందును కొంతమంది అమ్ముతున్నారని, వేలకు వేలు డబ్బు గుంజుతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుచేత ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రజలకు సరైన సమాచారం ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దాలి. కాని ప్రభుత్వం వైఖరి చాలా అస్పష్టంగా ఉంది. ఏదో ఒక విధంగా కోవిడ్‌ ను అరికట్టలేని తన వైఫల్యాన్నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్ళితే చాలునని భావిస్తున్నట్టుంది ప్రభుత్వం వైఖరి.
ప్రజలలో ఉన్న ఆత్రాన్ని, ఆందోళనను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే దౌర్భాగ్యం మన రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఉంది. ప్రజలందరూ కోరుకుంటున్నారన్న వాదనను ముందుకు తెచ్చి పబ్బం గడుపుకోజూస్తున్నారు వారంతా. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ పోటీ పడుతున్నాయి ఈ విషయంలో. వారికి పోయేదేముంది? పోయేవి ప్రజల ప్రాణాలే కదా? అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ అవకాశవాదాన్ని కట్టడి చేయాలి.
రామ్‌దేవ్‌ బాబా 'కరోనిల్‌' మందు గురించి ప్రచారం చేశాడు. దానిని మార్కెటింగ్‌ కూడా చేశారు. కాని అటు ఆయుర్వేద వైద్యులు గాని, ఇటు అల్లోపతి వైద్యులు గాని దానిని వాడడం లేదు కదా. ఆనందయ్య మందు విషయంలో ఎందుకీ తొందర?
ఇక గోమూత్రం, ఆవు పేడ వంటివి, గంగా స్నానం వంటిది, హోమాలు, తాయెత్తులు, రకరకాల నాటు వైద్యాలు, పసర్లు చాలా ఉన్నాయి. ఏ దిక్కూ తోచని జనం వాటికి కూడా ఎగబడతారు. జనం ఎగబడ్డారు గనుక రాజకీయ నాయకులు కూడా తాయెత్తులు, పోగులు కట్టించే కార్యక్రమాన్ని చేపడతారా ?
కొందరు ప్రజాశక్తి వైఖరిని విమర్శిస్తున్నవారు ఆనందయ్య కులాన్ని ముందుకు తెచ్చారు. కోవిడ్‌ మహమ్మారికి కులం, మతం, ప్రాంతం, దేశం అనే తేడాలు లేనట్టే, దానిని నియంత్రించగలిగే వ్యాక్సిన్‌ లకి సైతం అటువంటి భేదాలు లేవు కదా. మరి ఆనందయ్య మందు విషయంలో మాత్రం కులం ప్రస్తావన ఎందుకు? శాస్త్రీయ పరీక్షలకు ఆనంద య్య మందును గురి చేయడానికి జంకేవారు మాత్రమే ఇటువంటి సాకులతో వాదిస్తారు.
ప్రజాశక్తి ప్రచారం వెనుక కార్పొరేట్‌ ఆస్పత్రుల లాబీ పని చేస్తోందని మరి కొంతమంది ఆడిపోసుకుంటున్నారు. ఏ దుర్భిణీని ఉపయోగించి కనుక్కున్నారో ఈ విషయాన్ని తెలియదు కాని వారి వాదన తప్పు. ఎందుకంటే కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీ మీద రోజురోజుకీ పెరుగుతున్న జనాగ్రహాన్ని పక్కదోవ పట్టించడానికి ఆనందయ్య మందు ప్రచారం ఉపయోగపడుతుంది. ఆనందయ్య మందు పని చేస్తుందేమో అన్న భ్రమలు జనంలో కలిగితే ఆమేరకు వారు కార్పొరేట్‌ ఆస్పత్రుల అమానుష దోపిడీ గురించి ఆలోచించడం మానేస్తారు. పని చేస్తుందో లేదో నిర్ధారణ కాని మందు కోసం వెంటబడతారు. తాత్కాలికంగానైనా కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఒత్తిడిని తప్పించుకుంటాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీని ప్రభుత్వం జోక్యం కల్పించుకుని నియంత్రించాలన్న డిమాండ్‌ పక్కకు పోతుంది. ప్రభుత్వానికీ ఈ విషయంలో ఇబ్బంది తొలగిపోతుంది.

'నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుంది' అన్న సామెత ఊరికే రాలేదు. ఇక శాస్త్రీయ పద్ధతుల్ని చిన్నచూపు చూస్తూ మూఢవిశ్వాసాలకే పెద్దపీట వేసే ధోరణి ఈ నాటిది కాదు. శాస్త్రీయంగా ఆయుర్వేదాన్ని (నాటికి ఉన్న శాస్త్ర పరిజ్ఞానం మేరకు) రూపొందించిన ప్రాచీన వైద్యులు ఆనాడు మను వాదుల దృష్టిలో అంటరానివారు అయిపోయారు. సమాజం నుండి వెలివేయబడ్డారు. సత్యం కోసం నిబద్ధతతో నిలబడేవారికి ఈ విధమైన పరీక్షలు తప్పవు. సత్యం అంతిమంగా విజయం సాధించడమూ తథ్యం.

Post a Comment

0Comments

Post a Comment (0)