శ్రీనాథుని చాటువులు

Telugu Lo Computer
0

 

శ్రీనాథుని చాటువులు. ఒకసారి ఆయనకు ఒక వూరిలో నీళ్లు దొరకలేదట. అప్పుడు ఆయన చెప్పిన పద్యము.
సిరిగలవానికి జెల్లును
తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమునఁ కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
హరికేమి సిరి (ధనము)వున్నది ఆయన పదహారువేల మందినైనా పెళ్లిచేసుకుంటాడు.
బిచ్చమెత్తుకునే వాడివి నీ కిద్దరు యిద్దరు పెళ్ళాలెందుకయ్యాఈశ్వరా! ఆ గంగను (నీళ్లను) మాకిచ్చేసెయ్యి నీకు పార్వతి ఒక్కటీ చాలులే
గరళము మ్రింగితి నటంచుం
బురహర! గర్వింప బోకు పో!పో!పో! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెరిసెడి రేనాటి జొన్న మెదుకులు దినుమీ!
విషము తిన్నానని గర్వ పడుతున్నావేమో రాయలసీమ కి వెళ్లి ఆ మెరిసేటి జొన్నన్నము తిను అప్పుడు నీ గరళకంటుడు అనే నీ బిరుదు ఏమిటో,ఎందుకో నీకు తెలిసి వస్తుంది.
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు
పలనాటి సీమ పల్లెటూళ్ళు

రసికుడు పోవడు పల్నా
డె సగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశు డైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడె కుడుచున్
అర్థము:--- రసికుడు పలనాటి సీమకు వెళ్లడట . ఎందుకంటే అక్కడ రంభ కూడా ఏకులు వడుకుతూ బతుకుతుందట.రసికత ఎక్కడా కనబడదట , రాజు కూడా భూమిని దున్నుకొని బతుకు తాడట,మన్మథు డైనా జొన్న న్నమే తింటాడట. శ్రీనాథుడు చాలా రసికుడు.
అంగడి యూరలేదు, వరియన్నము లేదు, శుచిత్వమేమి లే,
దంగనలింపులేరు, ప్రియమైన వనంబులు లేవు,నీటికై
భంగ పడంగ బాల్పడు కృపావరులెవ్వరు లేరు, దాత లె
న్నంగను సున్నగాన బలనాటికి మాటికి బోవనేటికిన్
పలనాడులో భూమిలో ఎంతలోతు త్రవ్వినా నీరు పడేది కాదట.అక్కడ నీటికోసం బావులు
త్రవ్వించేపుణ్యాత్ములు కూడా అక్కడ కరువే.. దానం చేసేవాళ్ళు లేరు,ఆడవాళ్లు చూద్దామా అంటే అందంగా వుండరు. ఇటువంటి పాలనాటికి మాటి మాటికీ పోవడమెందుకు?
.
శ్రీనాధుడు దక్షిణ దేశానికి వెళ్లి నప్పుడు అక్కడ అరవ వాళ్ళింట్లో భోజనము ఇలా వుండిందట.
తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు,
చెవులో పొగ వెళ్లి చిమ్మిరేగ పలు తెరగుల
పచ్చళ్ళ తోడ చవి గొన్న బ్రహ్మ రంధ్రమున పారు
నా యవిశాకు వేచిన నార్నెల్లు నాసి లేదు పరిమళంబు
ఎంచిన పండ్లు సొగచు వేపాకు నెండించి చేసిన పొళ్ళను
కంచాన చూసిన గ్రక్కు వచ్చు అరవ వారింటి విందెల్ల నాగడంబు
అర్థము:-- మొదటనే మిర్యాల చారు వేస్తారట,అది ఎంత కారంగా వుంటుందంటే చెవులలోనుంచి పొగలు వస్తాయట, రకరకాల పచ్చళ్ళు
రుచి చూస్తే ఆ కారము బ్రహ్మ రంధ్రము వరకు తగులుతుందట,ఆ అవిశాకు పులుసు తింటే పండ్లు పులిసి పోతాయట (అంత పులుపు వుంటుందట)వేపాకు ఎండించి చేసిన పొడి కంచములొ చూస్తేనే వాంతికి కొస్తుందట. అరవ వారింట విందు యిలాగే వుంటుంది.
మేత గరి పిల్ల పోరున మేకపిల్ల
పారుబోతు తనంబున పంది పిల్ల
ఎల్ల పనులను చెరుపంగ పిల్లిపిల్ల
అందమున కొతిపిల్ల యీ అరవపిల్ల
అర్థము:-- శ్రీనాథునికి అరవ వాళ్ళంటే ఎందుకు సరిపోదో తెలీదు. తిండి తినడము లో ఏనుగు పిల్ల, కొట్లాడే ట ప్పుడు మేక పిల్ల మాదిరి అరుస్తుందట,పిరికితనములో పందిపిల్ల,అందానికి కోతి పిల్ల ఈ అరవ పిల్ల

జొన్నకలి,జొన్న యంబలి
జొన్నన్నము,జొన్నపిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్
ఇలాగ శ్రీనాథుడు పలనాటి వాళ్ళు జొన్నన్నమే తింటారని వెక్కిరిస్తూ చాలా పద్యాలు వ్రాశాడు.

శ్రీనాథుడు గురజాల సీమలో గల పులిపాడు అను గ్రామమునకు వెళ్ళాడట అక్కడ శేషయ్య యను కరణము, హనుమయ్య యను కాపును, పుల్లయ్య యను రెడ్డి యును తనని సరిగా గౌరవించ లేదని చెప్పిన పద్యము:
ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
కాపు కపివరుండు కసవు రేడు
గుంపు గాగ నిచట గురిజాల సీమలో
నోగులెల్ల గూడి రొక్కచోట
అర్థము;--- వూరి పేరేమో పులిపాడు పాము వంటి కరణము,(శేషయ్య), కాపేమో కోతి వంటి , హనుమయ్య,రెడ్దేమో కసవు(పనికి మాలినది) (పుల్లయ్య)
ఇలాంటి తెలివి లేని వారంతా గురిజాల సీమలో చేరి గ్రామాన్ని పాడు చేయు చున్నారు.

కవిసార్వభౌముడు శ్రీనాథుడు భోగ పురుషుడు. సన్న బియ్యం అన్నం తప్ప తినేవాడు కాదు. ఒకసారి ఆయన పల్నాటి సీమలో ఒకరింట్లో బస చేసినప్పుడు వాళ్ళు జొన్న అన్నము,లోకి ,చింతచిగురు, బచ్చలి యాకు కలిపి వండిన కూర పెట్టారట అప్పుడు చెప్పిన పద్యము:-
-
ఫుల్లసరొజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచు నిక్కెద వేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లగ నొక ముద్ద దిగమ్రింగుము నీ పస గాన నయ్యెడిన్

అర్థము:-- వికసించిన తామర కన్నులు కలవాడాకృష్ణా! ఎప్పుడో పూతన దగ్గర చేదు పాలు తాగినానని, అప్పుడెప్పుడో దావాగ్నిని మ్రింగి నానని గర్వ పడుతున్నావేమో, పల్నాటికీ పోయి ఉడుకు(వేడి) బచ్చలికూర,చింతచిగురు కలిపి వండిన కూర,జోన్నకూటితో కలిపి తిని చూడు నీ పస ఏమిటో తెలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)