కేంద్రం ఏం చేసిందని బీజేపీకి ఓటెయ్యాలె ?

Telugu Lo Computer
0


న్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ లో కేసీఆర్‌ బస్సుయాత్ర నిర్వహించారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు రోడ్‌ షో నిర్వహించిన కేసీఆర్‌.. అక్కడ క్లాక్‌టవర్‌ దగ్గర ప్రసంగిస్తూ కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటెయ్యాలని ఆయన నిలదీశారు. 'పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకోని జాతీయ హోదా కోసం 100 ఉత్తరాలు రాసినం. బతిమాలినం. ఇచ్చిండ్రా..? ఇక్కడి బీజేపీ అభ్యర్థి డీకే ఆరుణగారు. ఆమె ఐదేళ్ల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. పాలమూరుకు జాతీయ హోదా తెచ్చిందా..? మరి ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ దిగజారిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 రూపాయలకు పడిపోయింది. ఇది భారతదేశ గౌరవమా..? ఇది నరేంద్రమోదీ పరిపాలన ఫలితమా..? కేంద్రంలో 18 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నయ్‌. ఆ ఖాళీలు నింపుతున్నరా..? మరె నిరుద్యోగం ఎట్ల పోవాలె' అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 'మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెస్తే వాటికి వ్యతిరేకంగా ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేసిండ్రు. ఈ ధర్మా సందర్భంగా దాదాపు 750 మంది రైతులు చనిపోయిండ్రు. పోలీసు కంచెలు పెట్టి వాళ్లను కొట్టిండ్రు తప్ప ఢిల్లీ లోపలికి రానియ్యలే. నేను మన రాష్ట్రం తరఫున పంజాబ్‌కు పొయ్యి చండీగఢ్‌లో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు సాయం జేసిన. చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కో నవోదయ పాఠశాల ఇయ్యాలె. మనం 33 జిల్లాలు చేసుకున్నం. ఒక్క నవోదయ పాఠశాల అయినా ఇచ్చిండ్రా. ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వని బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వెయ్యొద్దు. నేను నూరు ఉత్తరాలు రాసినా ఒక్కటి గూడా ఇయ్యలే. అసుంటి బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలె..? దయచేసి ఆలోచన చేయండి' అని కేసీఆర్‌ చెప్పారు. 'దేశంలో మోదీ 157 మెడికల్‌ కాలేజీలు పెట్టిండు. మాకొక్కటి ఇయ్యమని బతిలాడినం. ఒక్కటన్నా ఇచ్చిండా..? మరెందుకు ఓటెయ్యాలె అని నేను అడుగుతున్నా. అంతేకాదు, నేను యువతకు ఒక్కటే చెబుతున్నా. భవిష్యత్తు మీది. తెలంగాణ మీది. ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తరో, ఎవరు న్యాయంగా ఉంటరో వాళ్లకు ఓటేస్తెనే మన బతుకులు బాగుపడుతయ్‌. పనిచేయని వాళ్లకు ఓటు వేస్తే ఇబ్బంది పెడుతరు. అందుకే ఓటు వేసేముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి ఓటు వేయండి' అని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)