బీజేపీ వాషింగ్‌ మెషిన్‌ లాంటిది !

Telugu Lo Computer
0


బీజేపీ వాషింగ్‌ మెషిన్‌ లాంటిదని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌ చంద్ర పవార్) అధినేత శరద్‌ పవర్ అన్నారు. పార్టీలో చేరిన అవినీతి వ్యక్తులు క్లీన్‌గా మారతారని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటున్నదని ఆయన ఆరోపించారు. పూణే జిల్లాలోని లోనావాలాలో జరిగిన తన పార్టీ కార్యకర్తల సదస్సులో శరద్ పవార్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి గురించి మాట్లాడుతూ అవిభజన ఎస్పీపీతో సహా విపక్ష పార్టీలను విమర్శిస్తారని అన్నారు. ఇటీవల పార్లమెంటులో ఒక బుక్‌లెట్ ఇచ్చారని, బీజేపీ అధికారంలో లేనప్పుడు ఎలాంటి అక్రమాలు జరిగాయో అందులో పేర్కొన్నారని చెప్పారు. అయితే ఆ బుక్‌లెట్‌లో ప్రస్తావించిన ఆదర్శ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న అశోక్ చవాన్, సరిగ్గా ఏడో రోజున బీజేపీ చేరి రాజ్యసభ సభ్యుడయ్యారని గుర్తు చేశారు. కాగా, దీనికి ముందు మహారాష్ట్రలో రూ.70,000 కోట్ల సాగునీటి స్కామ్, మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో అక్రమాల గురించి ప్రధాని మోదీ మాట్లాడారని శరద్‌ పవార్‌ తెలిపారు. అయితే ఏ వ్యక్తిపై మోదీ ఆరోపణలు చేశారో ఆ వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చూశారుగా అని అన్నారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిన అజిత్‌ పవర్‌ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఒక వైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ మరోవైపు ఆ వ్యక్తులను బీజేపీలో చేర్చుకుంటున్నారని శరద్‌ పవర్‌ మండిపడ్డారు. 'అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చేర్చుకుని క్లీన్ చేసే వాషింగ్ మెషీన్‌గా బీజేపీ మారిందని ఇదంతా తెలియజేస్తోంది' అని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)