భారత జాగృతి కమిటీలన్నీ రద్దు !

Telugu Lo Computer
0

భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు కవిత ఆదివారం ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కవిత తెలిపారు. కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని కవిత స్పష్టం చేశారు. అయితే కమిటీల రద్దుకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, గతంలో టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చారు కవిత. ఈ క్రమంలోనే భారత్ జాగృతి కమిటీలను వేశారు. పలు రాష్ట్రాలకు కూడా కమిటీల బాధ్యులను ప్రకటించారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ కొత్త కమిటీలను వేస్తారా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచిచూడాలి. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)