రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్‌ !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఇటీవల జీవనకాల గరిష్ఠాల వద్ద ట్రేడయిన సూచీలు మదుపరుల అప్రమత్తత కారణంగా నష్టాలు ఎదుర్కొన్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ చీఫ్‌ జెరోమ్‌పావెల్‌ కాంగ్రెస్‌ ముందు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే వారం అమెరికా జాబ్‌ డేటా రానుంది. ఈక్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు సహా దేశీయ మార్కెట్‌ సూచీలూ నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్‌ ఉదయం 73,767 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరికి 195.16 పాయింట్ల నష్టంతో 73,677.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 49.30 పాయింట్ల నష్టంతో 22,356 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ -30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫీ, నెస్లే ఇండియా, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 82.89గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 82.53 వద్ద ట్రేడవుతోంది. ఔన్సు బంగారం ధర 2,134 డాలర్ల వద్ద మూడు నెలల గరిష్ఠానికి చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)