హిమంత బిశ్వ శర్మ, మురళీ దేవ్‌రా లాంటి వారు కాంగ్రెస్‌ను వీడడం మంచిదే !

Telugu Lo Computer
0


హిమంత బిశ్వ శర్మ, మురళీ దేవ్‌రా వంటి నేతలు కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని, వారు పార్టీ సిద్ధాంతంతో తాదాత్మం చెందరని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ నుంచి నేతల వరుస నిష్క్రమణల నేపథ్యంలో రాహుల్ ఈవిధంగా వ్యాఖ్యానించారు. 2014లో బిజెపిలో ఫిరాయించిన హిమంత శర్మ ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి. కాగా, మురళీ దేవ్‌రా క్రితం నెల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. గురువారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లో పార్టీ 'డిజిటల్ మీడియా యోధులను' ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ సిద్ధాంతాలను పరిరక్షించడమే తన కర్తవ్యమని ఉద్ఘాటించారు. 'హిమంత, మిళింద్ వంటి వ్యక్తులు పార్టీని వీడాలని కోరుకుంటున్నా. వారు అలా వీడితే నాకు ఫర్వాలేదు. హిమంత ఒక తరహా రాజకీయాలకు ప్రాతినిధ్యవహిస్తున్నారు. అవి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కావు' అని రాహుల్ అన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 25న అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. యాత్ర తదుపరి మజిలీ ఝార్ఖండ్. 'ముస్లింల గురించి హిమంత చేసిన ప్రకటనలు కొన్నిటిని మీరు విన్నారా ? వాటితో నాకు ఏమాత్రం సంబంధం లేదు. నేను కాపాడాలనుకుంటున్న విలువలు కొన్ని ఉన్నాయి' అని రాహుల్ చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి, దక్షిణ ముంబయి మాజీ ఎంపి మురళీ దేవ్‌రా రాజీనామా కొత్త రాజకీయ ప్రస్థానాలకు, ముఖ్యంగా బిజెపిలో చేరికకు పూనుకుని కాంగ్రెస్ నుంచి నిష్క్రమిస్తున్న నేతలకు తాజా ఉదాహరణ. హిమంత శర్మ తరువాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీలోకి ఫిరాయించిన విషయం విదితమే. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, పంజాబ్ పిసిసి మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, ప్రియాంక చతుర్వేది, హార్దిక్ పటేల్, సుస్మితా దేవ్, ఆర్‌పిఎన్ సింగ్ వంటి ప్రముఖ నేతలు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకున్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలుపై బిజెపి నాయకులు ఇటీవల చేసిన ప్రకటనలపై రాహుల్ వ్యాఖ్యానిస్తూ, మతం ప్రాతిపదిగా చీలిక తెచ్చేందుకు బిజెపి ఉపయోగిస్తున్న సాధనమే ఆ చట్టం అని అన్నారు. 'అవి బిజెపికి ఉపకరణాలు. వారి మౌలిక ఉద్దేశం దేశాన్ని చీల్చడం, మత వర్గాల మధ్య ఉద్రిక్తత సృష్టించడం' అని రాహుల్ ఆక్షేపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)