రైలులో అపరిశుభ్రతపై రూ.30వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

Telugu Lo Computer
0


రైలులో అపరిశుభ్రత, డర్టీగా టాయిలెట్లు, వాటర్‌ లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల ఒక ప్రయాణికుడు మానసిక క్షోభ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సేవల లోపంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ ప్రయాణికుడికి రూ.30,000 పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కోసం రూ.10,000 చెల్లించాలని రైల్వేనువినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి 2021 సెప్టెంబర్ 3న రైలులో ఇండోర్‌కు ప్రయాణించాడు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం థర్డ్‌ ఏసీ టికెట్‌ కొనుగోలు చేశాడు. కాగా, ఆ ప్రయాణికుడు రైలు ప్రయాణంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. టాయిలెట్‌ అపరిశుభ్రంగా ఉండటం, నీరు లేకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా ఏసీ కోచ్‌లో నీళ్లు లేవని ఆరోపించాడు. దీని వల్ల మానసిక క్షోభకు గురైన అతడు తీవ్రమైన తలనొప్పితో బాధపడినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ రోజు పనికి వెళ్లకుండా సెలవు తీసుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. మరోవైపు రైలులో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి రైల్వేకు, రైల్వే మంత్రికి సోషల్‌ మీడియా ద్వారా ఆ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. 'సిటిజన్ చార్టర్'లో పేర్కొన్న మేరకు ప్రయాణీకులకు కనీస, ప్రాథమిక సౌకర్యాలను రైల్వే కల్పించలేదని ఆరోపించాడు. ఆ ప్రయాణికుడు ఎదుర్కొన్న ఇబ్బందులపై జిల్లా వినియోగదారుల ఫారం సానుకూలంగా స్పందించింది. సేవా లోపాలకు పాల్పడిన రైల్వే ఆ ప్రయాణికుడికి రూ.30,000 చెల్లించాలని ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చుల కోసం అదనంగా రూ.10,000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)