రేవంత్ రెడ్డి ఫోటోకి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పాలాభిషేకం !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి పారదర్శక పాలన సాగించడానికి చేస్తున్న ప్రయత్నాలు, సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం వంటి అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. ఎంతో కాలంగా ఏపీ లో ఉద్యోగులు పోరాటం చేస్తున్నా పరిష్కారం కాని సమస్యకు, తెలంగాణాలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చిటికెలో పరిష్కారం చేసి తెలంగాణా ఉద్యోగులకు సంతోషం కలిగించారు. దీంతో ఏపీ ఉద్యోగులు సీఎం అంటే రేవంత్ రెడ్డిలా ఉండాలి అని వారు అభిప్రాయం వ్యక్తం చేసేలా చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంలో భాగంగా, కాంగ్రెస్ ఇచ్చిన హామీల కొనసాగింపులో భాగంగా అసెంబ్లీ వేదికగా గవర్నర్ తమిళి సై తన ప్రసంగంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. పెన్షన్ అనేది బిక్ష కాదు ఉద్యోగుల హక్కు అంటూ పేర్కొన్న ఏపీ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు సీఎం జగన్ కూడా తన మాట నిలబెట్టుకోవాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకి ఏపీలో పాలాభిషేకం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)