నోటి దుర్వాసన - నివారణోపాయాలు !

Telugu Lo Computer
0


కొందరికి తరచుగా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనికి ఎన్నో కారణాలుంటాయి. సరిగ్గా బ్రష్‌ చేసుకోకపోవడం, తిన్న తరవాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు సరిగ్గా మాట్లాడలేరు. ఈ దుర్వాసన వల్ల పక్కన ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో దుర్వాసనతో పాటు తేన్పులు కూడా బ్యాడ్​ స్మెల్​ వస్తుంటాయి.దీనికి ఇంట్లో లభించే పదార్థాలతో సహజ పద్ధతిలో నోటి దుర్వాసనను అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు.

నీళ్లు ఎక్కువగా తాగండి : నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు తరచూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడల్లా, నీటిని తాగాలి. సోడా వంటివి తాగకండి, ఇవి నోటిని మరింత పొడిగా చేస్తాయి.

గోరువెచ్చని ఉప్పు నీటితో : ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసనను తరిమికొట్టవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ వరకు ఉప్పును కలిపి, 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి.

లవంగాలతో : లవంగం నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాన్ని నిధానంగా నమలడం, చప్పరించటం వల్ల దుర్వాసన సమస్యను పరిష్కరించవచ్చు. వీటిని నమలడం వల్ల తాజా శ్వాసను పొందవచ్చు. అలాగే ఇవి నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ : ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి, ఆ నీటిని 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి. దీని వల్ల నోటి దుర్వాసన పోయి.. నోరు ఫ్రెష్​గా ఉంటుంది.

పండ్లు, కూరగాయలు : తాజా పండ్లు, కూరగాయలను రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. యాపిల్స్, సెలెరీ, క్యారెట్లను తినడం వల్ల దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా నాశనమవుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లు లాలాజల ఉత్పత్తిని పెంచి, నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.

ఆల్కహాల్ లేని హోమ్‌మేడ్ మౌత్ వాష్ : ఈ సమస్యతో బాధపడే వారు మార్కెట్లో దొరికే మౌత్‌ వాష్లను ఉపయోగిస్తుంటారు. వీటిలో ఆల్కహాల్ ఉంటుంది. ఇవి అందరికీ పని చేయవు! అందుకే సహజ పద్ధతిలో ఇంట్లోనే మౌత్ వాష్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే.. ముందుగా ఒక కప్పు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడి, రెండు నిమ్మకాయల రసం, ఒక టీస్పూన్​ తేనె, 1/2 టీస్పూన్ బేకింగ్ సోడాను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక జార్​లో పోయాలి. ఈ మౌత్ వాష్ 2 వారాల వరకు తాజాగా ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్ : నోటి దుర్వాసనను తొలగించడంలో టీ ట్రీ ఆయిల్ బాగా పని చేస్తుంది. మీరు బ్రష్‌ చేసేటప్పుడు టూత్‌పేస్ట్‌పై కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను వేసుకోండి. అలాగే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి, దానితో మీ నోటిని శుభ్రం చేసుకోవచ్చు.

దంతాలను ఫ్లాస్ చేయండి : మనం ఆహారం తిన్న తరవాత నోటిని పుక్కిలించి ఉమ్మివేయకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అందుకే ఫ్లాసింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాల మధ్య లేదా వాటిపై ఉన్న బ్యాక్టీరియా, ఆహారం తొలగిపోతుంది.

నాలుకను శుభ్రం చేసుకోండి : బ్రష్‌ చేస్తున్నప్పుడు దంతాలతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోండి. నాలుకపై ఉన్న బాక్టీరియాలు కూడా దుర్వాసన రావడానికి కారణమవుతాయి.

చూయింగ్ గమ్ : చూయింగ్ గమ్ లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. దీనివల్ల నోటి దుర్వాసనను కలిగించే బాక్టీరియా చనిపోతుంది. అందుకే వీటిని నమలండి. షుగర్ లేని గమ్‌లను నమలడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితో పాటు ప్రతి రోజు ఉదయం, రాత్రి బ్రష్‌ చేసుకోవడం వల్ల నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)