కొవిడ్‌ వ్యాక్సిన్‌ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదు !

Telugu Lo Computer
0


కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నాఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది. యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలను విశ్లేషించేందుకు 2021 అక్టోబర్‌ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య కాలంలో ఐసీఎంఆర్‌ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. దీని కోసం ఆకస్మికంగా మరణించిన 18-45 ఏళ్ల వయసు వ్యక్తుల కేసులను అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 729 కేసులు, 2916 కంట్రోల్‌ కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఈ అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని పేర్కొంది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నాఈ ముప్పు తగ్గుతుందని నివేదికలో వెల్లడించింది. ఈ ఆకస్మిక మరణాలకు ధూమపానం, తీవ్ర శ్రమ, మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం వంటి వాటితోపాటు కొవిడ్‌ చికిత్స తర్వాత జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి కూడా కారణాలు కావొచ్చని వివరించింది. ఇటీవల గుజరాత్‌లో జరిగిన ప్రపంచ సంప్రదాయ ఔషధ సదస్సులో ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ రెండు అధ్యయనాలను చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ రాజీవ్‌ బహల్ తెలిపారు. ఐసీఎంఆర్.. 50 పోస్టుమార్టం నివేదికలపై అధ్యయనం చేసిందని, మరో 100 నివేదికలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఇది కొవిడ్ 19 వ్యాప్తి పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని, ఇతర మరణాలను నిరోధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఐసీఎంఆర్ మొదటి అధ్యయనంలో భాగంగా కరోనా తర్వాత ఆకస్మికంగా చనిపోయిన వారి శరీరాల్లో ఏదైనా మార్పులు జరిగాయా? అని పరిశీలిస్తోంది. ఆకస్మికంగా గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యాల వల్లే అధిక మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారిస్తున్నట్లు బహల్ పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)