పతంజలి ఆయుర్వేదపై దుష్ర్పచారం !

Telugu Lo Computer
0


ధునిక వైద్యంపై తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేయడం పట్ల పతంజలి ఆయుర్వేదను సుప్రీంకోర్టు హెచ్చరించడంపై బాబా రాందేవ్ స్పందించారు. పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి వ్యతిరేకంగా ఆధునిక వైద్యానికి చెందిన డాక్టర్ల గ్యాంగ్ దుష్ర్పచారం సాగిస్తోందని ఆయన ఆరోపించారు. పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్దాపకులు రాందేవ్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు డాక్టర్ల బృందం ఆయుర్వేద, యోగ, నాచురోపతి సహా మన సనాతన విలువలకు వ్యతిరేకంగా దుష్ర్పచారం సాగిస్తోందని దుయ్యబట్టారు. రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం, కీళ్లనొప్పులు, కాలేయ వ్యాధి, కిడ్నీ వైఫల్యం వంటి వ్యాధులకు సింథటిక్ ప్రపంచంలో పరిష్కారం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సహజ వనరుల నుంచి సంగ్రహించి ప్రయోగశాలలో సింథటిక్ మెడిసిన్స్ తయారవుతున్నాయని రాందేవ్ వివరించారు. పతంజలి మందుల ద్వారా ఎంతోమందికి వ్యాధులు నయమయ్యాయని శాస్త్రీయ ఆధారాలు తమ కంపెనీ వద్ద ఉన్నాయని తెలిపారు. యోగ, ఆయుర్వేద, నేచురోపతి విధానంలో నిరూపణ అయిన చికిత్సా పద్ధతుల ద్వారా తాము టైప్ 1 డయాబెటిస్, థైరాయిడ్‌, హైబీపీ, షుగర్‌, ఊబకాయం వంటి రుగ్మతలను నయం చేశామని చెప్పారు. ఇది అసత్యం కాదని నిజమని రాందేవ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టును, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఆధునిక వైద్య విధానంపై తాము ఎలాంటి దుష్ప్రచారం సాగించడం లేదని అన్నారు. తాము తప్పుడు ప్రచారం చేస్తే తమకు మరణ శిక్ష వంటి కఠిన శిక్ష విధించవచ్చని అందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)