విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి !

Telugu Lo Computer
0


విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రకాల విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని బుధవారం తీర్పు చెప్పింది. ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను ఫిబ్రవరిలో విచారించేందుకు కోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. “దేశవ్యాప్తంగా విద్వేషపూరిత ప్రసంగాల సమస్యను పర్యవేక్షించలేము” అని పేర్కొంది. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కచ్చితంగా సమస్యలు వస్తాయని, అయితే దాన్ని ఎదుర్కోవడానికి మనకు పరిపాలనా వ్యవస్థ ఉందా అనే ప్రశ్న వేసుకోవాలని అన్నారు. ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ సందర్భంలో కోర్టు మరో ఆసక్తికర వ్యాఖ్య చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని సమాజం తెలుసుకోవాలని, అయితే తాము దేశవ్యాప్తంగా ఈ చర్య తీసుకోలేమని, ప్రతిరోజూ దరఖాస్తులు వస్తూనే ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. 2018లో తెహసీన్ పూనావాలా కేసులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విద్వేషపూరిత నేరాలను నిరోధించాలని, నేరాన్ని నమోదు చేయడానికి బాధ్యత వహించే నోడల్ అధికారిని కూడా నియమించాలని ఆదేశించింది. దేశంలోని లౌకిక స్వభావాన్ని పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ.. ఏ మతానికి చెందిన వారైనా ద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులను ఏప్రిల్‌లో కోర్టు కోరింది. సూచనలు పాటించకుంటే ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)