మహువా మోయిత్రా ఎథిక్స్ కమిటీ సమన్లు !

Telugu Lo Computer
0


పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా కేసులో చిక్కుకుంది. తాజాగా ''క్యాఫ్ ఫర్ క్వేరీ'' అని పిలువబడుతున్న ఈ కేసులో లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రాకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 31న హాజరుకావాలని ఆదేశించింది. ఈమెపై వచ్చిన ఆరోపణల్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. మహువా మోయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో పాటు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌లను కమిటీ మూడు గంటల పాటు విచారించిన తర్వాత సమన్లు జారీ చేసింది. వీరు చేసిన ఆరోపణల్లో ప్రతీ అంశాన్ని కమిటీ చర్చించినట్లు తెలిసింది. లోతైన దర్యాప్తు కోసం కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వివరాలు కోరుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖకు లేఖలు పంపినట్లు ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ విలేకరులకు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీలపై విమర్శలు చేసేందుకు, అందుకు తగ్గట్లు పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగింనందుకు మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి లంచం తీసుకున్నట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆ తరువాత హీరానందానీ కూడా ఈ ఆరోపణలు నిజమే చెబుతూ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. తాను చేయకూడని తప్పులు చేయించిందని మోయిత్రాపై ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఇప్పటికే నిషికాంత్ దూబే పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే మోయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరేవారితో పంచుకుందని, ఆమె ఇండియాలో ఉన్న సమయంలో కూడా దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయినట్లు ఆరోపించారు. దీనిపై విచారించాల్సిందిగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు. అయితే ఈ వ్యవహారంలో టీఎంసీ పార్టీ కూడా ఆమెకు దూరంగా ఉంటోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)