బెంగళూరులో సొరంగ రహదారులు

Telugu Lo Computer
0


బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించే దిశలో 190 కిలోమీటర్ల మేరకు టన్నెల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు నగర ఇన్‌చార్జ్‌గా ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇందుకు 8 కంపెనీలు అర్హత పొందాయని పీజబులిటీ రిపోర్టు అందిన తర్వాత 45 రోజుల్లోగా టెండర్‌ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కారిడార్లను అభివృద్ధిచేయాలని టెండర్లు ఆహ్వానించామని ఇందులో భాగంగానే రహదారుల విస్తరణ, సొరంగ రహదారుల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి పలు కీలకమైన సలహాసూచనలు వచ్చాయని ఆయన వివరించారు. కారిడార్ల నిర్మాణానికి సంబంధించి అంతార్జాతీయ స్థాయిలో టెండర్లు ఆహ్వానించగా 9 కంపెనీలు పాలుపంచుకున్నాయన్నారు. వీటితో పాటే టనెల్‌ రహదారుల ప్రక్రియను కూడా ఏకకాలంలో ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందన్నారు. టన్నెల్‌ రోడ్లను 4 మార్గాలుగా నిర్మించాలా? 6 మార్గాలకుగా నిర్మించాలా? ఎక్కడ ప్రారంభించి ఎక్కడ పూర్తిచేయాలి? బెంగళూరు నగరమంతటా వీటిని నిర్మించాలా అనే అంశంపై నిపుణుల నుంచి ఫీజబులిటీ నివేదికను కోరామన్నారు. ఈ పథకం అమలైతే భారీగానిధులు అవసరం కానున్నాయని అందువల్లే దశలవారీగా చేపట్టాలనే ఆలోచన కూడా ఉందన్నారు. టనెల్‌రోడ్ల నిర్మాణ రంగంలోనూ పలు కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించే అంశం పరిశీలనలో ఉందన్నారు. ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే బళ్ళారి రోడ్డు, పాత మదరాసు రోడ్డు, ఎస్‌టి.మాల్‌ జంక్షన్‌ నుంచి మెఖ్రి సర్కిల్‌వరకు, సర్జాపుర రోడ్డు, హొసూరు రోడ్డు, కనకపుర రోడ్డు, యశ్వంతపుర రోడ్డు, కెఆర్‌పురం, సిల్క్‌బోర్డు తదితర ప్రదేశాలను టనెల్‌రోడ్ల నిర్మాణంకోసం పరిశీలిస్తున్నామన్నారు. టనెల్‌ తవ్వేందుకు పెద్ద యంత్రాలను ముంబై, ఢిల్లీల నుంచితెప్పించాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలులు పడ్డ సమయాల్లో గంటలకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)