ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా ?

Telugu Lo Computer
0


భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం ముదురుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఎజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. ఇదే కాకుండా భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి బదులుగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ ఈ పరిణామాలపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఢిల్లీలో మాట్లాడారు. కెనడా చేసిన ఆరోపణలపై ఆ దేశం ఎలాంటి నిర్ధిష్ట సమాచారం ఇవ్వలేదని, ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవిగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అయితే కెనడా ప్రధాని చేసిన ఆరోపణలకు ఎలాంటి విషయాలను పంచుకోలేదని అన్నారు. అయితే కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్ వ్యక్తుల వివరాలను భారత్ అందించినప్పటికీ, కెనడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని బాగ్చీ అన్నారు. ప్రధాని మోడీ ముందు కెనడా పీఎం ట్రూడో ఈ ఆరోపలు చేస్తే వాటిని మోడీ ఖండించారని తెలిపారు. కెనడాలో ఉన్న సిబ్బంది కంటే భారతదేశంలో కెనడా సిబ్బంది ఎక్కువగా ఉందని, వారి దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోవాలని భారతదేశం కోరుతోందని కేంద్రం వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 20 మందికి పైగా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాగ్చీ కెనడాను కోరారు. కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని, కెనడా వీసా ప్రాసెసింగ్ ఖలిస్తాన్ ఉగ్రవాదంతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే ఇరు దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. ఇరు దేశాలు వారి పౌరులకు ఆయా దేశాల్లో రక్షణ అడ్వైజరీని జారీ చేశాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ ఈ ఏడాది జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఇదే ఇరుదేశాల మధ్య వివాదానికి కారణమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)