ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ భూకంప అలర్ట్‌లు !

Telugu Lo Computer
0


ఆండ్రాయిడ్‌ యూజర్లకు భూకంప  అలర్ట్‌లు పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ముందస్తుగానే భూకంపాల సందేశాలను పంపిస్తుంది. ఇందుకోసం నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ), నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ (ఎన్‌ఎస్‌సీ)తో కలిసి పనిచేయనుంది. ఇటువంటి వ్యవస్థను ఇప్పటికే పలు దేశాల్లో అమలు చేస్తోంది. ఈ అలర్ట్‌లు ఆండ్రాయిడ్‌ సపోర్టు చేసే భారతీయ భాషల్లో కూడా లభిస్తాయి. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో ఉండే యాక్సెలరోమీటర్‌ మినీ సిస్మోమీటర్లుగా పనిచేస్తాయని పేర్కొంది. ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో భూప్రకంపనలను ఇవి ముందుగానే గుర్తిస్తాయని వెల్లడించింది. ఏకకాలంలో చాలా ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఇలా స్పందించినప్పుడు తమ కంపెనీ సర్వర్‌ ఈ సంకేతాలను మొత్తం సేకరించి ఆ ప్రదేశంలో భూకంపం వచ్చిందేమో చెక్‌ చేస్తాయి. ఈ క్రమంలో ప్రకంపనల తీవ్రత, భూకంప కేంద్రాన్ని కూడా అంచనావేస్తాయి. అనంతరం తక్షణమే వినియోగదారులకు అలర్ట్‌లు వెళ్లిపోతాయి. ''ఇంటర్నెట్‌సంకేతాలు కాంతివేగంతో ప్రయాణిస్తాయి. భూకంప షాక్‌ తరంగాల కంటే ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ఆ తరంగాల కంటే ముందే అలర్ట్‌లు వినియోగదారుల ఫోన్లకు చేరతాయి'' అని గూగుల్‌ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే ఈ అలర్ట్‌ల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్‌ 5 ఆపై వెర్షన్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ అలర్ట్‌లు అందుకోవాలంటే వినియోగదారుల ఫోన్లు ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉండాలి. ఈ అలర్ట్‌లు ఆఫ్‌ చేసుకొనేందుకు కూడా ఆప్షన్‌ ఉంది. దీంతోపాటు ఈ వ్యవస్థలు సమీపంలోని భూకంపాలకు సంబంధించిన సమాచారం కూడా అందజేస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)