ఈ భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తోంది !

Telugu Lo Computer
0


‘పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు’ సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌ 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించారు. మంగళవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. భారత్‌ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి అని అన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా పాత భవనం నిరంతర ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ‘చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. చారిత్రక పార్లమెంట్‌ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. భారతీయులు స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించాం. స్వాతంత్ర్యానికి ముందు ఈ భవనం ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌గా ఉండేది. ఈ పార్లమెంట్‌ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మనం కొత్త భవనంలోకి వెళుతున్నప్పటికీ, పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ఈ భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తోంది. పాత పార్లమెంట్‌తో ఎంతో అనుబంధం ఉంది. పార్లమెంట్‌లో తొలిరోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ప్రారంభంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువగా ఉండేది. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రజల సందర్శనకు పాత పార్లమెంట్‌ భవన్‌ తెరిచే ఉంటుంది’ అని ప్రధాని మోడీ తెలిపారు. ‘చంద్రయాన్-3 విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇది మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ప్రతీక. చంద్రయాన్-3 విజయం ప్రపంచం మొత్తం సంబరం చేసుకునేలా చేసింది. సమిష్టి కృషి వల్లే జీ-20 సదస్సు విజయవంతమైంది. జీ-20 విజయం దేశ ప్రజలందరిది. భారత్ సామర్థ్యంపై చాలా మందికి సందేహాలు ఉండేవి.. అవన్ని పటాపంచలు అయ్యాయి. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ-20లో కలుపుకున్నాం.. భారత్ ఇప్పుడు అన్ని దేశాలకు విశ్వమిత్రగా మారుతోంది’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)