వైభవోపేతంగా శ్రీవారి రథోత్సవం !

Telugu Lo Computer
0


తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నుల పండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజున- ఉభయ దేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. సోమవారం 66,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,103 మంది తలనీలాలను సమర్పించారు. నాలుగు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. హుండీ కానుకల ద్వారా 3.88 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరించారు. భక్తులు అడుగడుగునా శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో తిరుమల ఆలయ మాడవీధులు మారుమోగాయి. ప్రసిద్ధ దేవాలయాలలో బ్రహ్మోత్సవ సమయాల్లో ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం అనాదిగా వస్తోంది. ఆగమశాస్త్రాల్లో రథోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రథోత్సవాన్ని మోక్షప్రదాయకంగా భావిస్తారు. ఆగమశాస్త్రబద్ధంగా, వేలాదిమంది భక్తుల జయజయధ్వానాల మధ్య తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామివారిని ఊరేగించారు అర్చకులు. రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు రథాన్ని ముందుకు లాగారు. నాలుగు గంటల పాటు రథోత్సవం సాగింది. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)