ఇస్రో సంధించే వ్యోమమిత్ర !

Telugu Lo Computer
0


అంతరిక్షంలోకి గగన్ యాన్ ప్రయోగం కోసం తయారైన వ్యోమమిత్ర. చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఏడాది అక్టోబర్‌లో గగన్‌యాన్‌ మిషన్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సమాయత్తమైంది. అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ను ఇస్రో చేపట్టనుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రయోగంలో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి ఇస్రో పంపించనుంది. అచ్చు మనిషిలాగే అన్ని కార్యక్రమాలు నిర్వహించగలిగే సత్తా ఉన్న ఈ మహిళా రోబో ప్రయోగం విజయవంతం అయితే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చునని ఇస్రో భావిస్తోంది. ఇటీవల బెంగళూరులోని ఇస్రోలో జరిగిన సదస్సులో వ్యోమమిత్ర రోబో స్వయంగా మాట్లాడింది. చంద్రుడిపై మొట్టమొదటిసారి దక్షిణ ధ్రువంపై కాలు మోపి ఇస్రో చారిత్రక విజయాన్ని సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం పట్ల దేశ, విదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలకు ముందడుగు వేస్తోంది. ఇస్రో అంతరిక్షంలోకి మనుషులను పంపాలనే లక్ష్యంతో చేపడుతున్న గగన్‌యాన్ ప్రయోగంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. గగన్‌యాన్ ప్రయోగాన్ని 2022 ఏడాదిలోనే అంతరిక్షంలోకి పంపించాల్సి ఉన్నా కొవిడ్ మహమ్మారి కారణంగా అది ఆలస్యం అయింది.భారతదేశం రాబోయే గగన్‌యాన్ మిషన్ కోసం వ్యోమమిత్ర అనే మహిళా రోబోను రూపొందించారు. ఈ మిషన్ ట్రయల్స్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. స్త్రీ వేషధారణతో ఉన్న మానవరూప రోబోట్ వ్యోమమిత్ర అంతరిక్షంలో ప్రయాణించనుంది. ఈ మహిళా రోబోను 2020వ సంవత్సరం జనవరి నెలలో జరిగిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్… ప్రెజెంట్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఈవెంట్ ప్రారంభ సెషన్‌లో ఆవిష్కరించారు. ఈ సింపోజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొని రోబోతో మాట్లాడారు. ఈ రోబోను తిరువనంతపురంలోని ఇస్రో యొక్క ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్‌లో రూపొందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)