సీబీఐ దర్యాప్తు చేసిన అవినీతి కేసులు 6,841 పెండింగ్‌లో ఉన్నాయి !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు చేసిన 6,841 అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో 300కి పైగా కేసుల విచారణ 20 ఏళ్లకు పైబడి సాగుతూనే ఉంది. ఈ మేరకు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌  తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. మొత్తం కేసుల్లో 313 కేసులు 20ఏళ్లకు పైగా పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 2,039 కేసుల విచారణ 10-20 ఏళ్లుగా సాగుతోంది. 2,324 కేసులు 5-10 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. 842 కేసుల విచారణ 3-5 ఏళ్లుగా సాగుతోంది. మూడేళ్ల కంటే తక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 1,323గా ఉంది. వీటితో పాటు, అవినీతి కేసులకు సంబంధించి 12,408 అప్పీళ్లు, రివిజన్లు సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సీవీసీ వెల్లడించింది. ఇందులో 417 అప్పీళ్లు 20ఏళ్ల నాటి కిందివే అని పేర్కొంది. ఇక, సీబీఐ వద్ద 692 అవినీతి కేసులు దర్యాప్తు దశలోనే పెండింగ్‌లో ఉన్నట్లు సీవీసీ తెలిపింది. ఇందులో 42 కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. సాధారణంగా అవినీతి కేసుల్లో సీబీఐ కేసు నమోదైన ఏడాది లోగా దర్యాప్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే, అధిక పనిభారం, సిబ్బంది కొరత, సుదూర ప్రాంతాల్లో ఉన్న సాక్షుల అడ్రస్‌లను గుర్తించి, వారిని ప్రశ్నించడం వంటి కారణాలతో సీబీఐ దర్యాప్తులు ఆలస్యమవుతున్నాయని సీవీసీ తమ నివేదికలో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)