పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో భాగమే !

Telugu Lo Computer
0


జమ్మూకాశ్మీర్‌లోని ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని, అక్కడి ప్రజలు ప్రశాంత జీవనం కోసం ఇండియా వైపు చూస్తున్నారని, పాకిస్థాన్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. పీఓకేను పదే పదే పాకిస్థాన్ క్లెయిమ్ చేయడం వల్ల వారు సాధించేదేమీ లేదని చెప్పారు. పీఓకేను పాక్ ఆక్రమించుకోవడం ఎంతమాత్రం చెల్లుబాటు కాదని అన్నారు. జమ్మూలో సోమవారంనాడు జరిగిన సెక్యూరిటీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, పీఓకే భారత్‌ అంతర్భాగమని పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. ఈ దిశగా కనీసం మూడు ప్రతిపాదనలు పార్లమెంటు ఆమోదం పొందాయని తెలిపారు. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న జమ్మూకాశ్మీర్ ప్రజలకు న్యాయం చేసేందుకే 370వ అధికరణను రద్దు చేశామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆర్టికల్ 370, 35ఏ కారణంగా జమ్మూకాశ్మీర్ ప్రజలు చాలాకాలంగా దేశ జనజీవన స్రవంతిలో కలవలేకపోయారని, దేశవ్యతిరేక శక్తులపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఈ అధికరణలు అవరోధంగా నిలిచాయని వివరించారు. 370వ అధికరణ రద్దుతో సామాన్య ప్రజానీకం చాలా సంతోషంగా ఉందని, విద్వేషం, వేర్పాటువాద దుకాణాలు మూతపడటం గిట్టనివారికే ఇది సమస్యగా కనిపిస్తోందని అన్నారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే నిధులు అందకుండా చేశామని, ఉగ్రవాదులను ఏరివేస్తూ, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిలిపివేశామని చెప్పారు. స్థానికంగా ఉగ్రవాద కార్యలాపాలకు ఊతమిస్తున్న నెట్‌వర్క్‌ను దెబ్బతీశామని తెలిపారు. ఉగ్రవాదంపై అమెరికాతో సహా ప్రపంచ దేశాల ఆలోచనా ధోరణిలో భారత్ మార్పు తీసుకువచ్చిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్త ప్రకటన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిందని రాజ్‌నాథ్ చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలు ఇంక ఎంతోకాలం తమ ఆటలు చెల్లవని గ్రహిస్తున్నారని, ఇవాళ ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉన్నాయని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)