పెళ్లి పేరుతో రిటైర్డ్‌ ఉద్యోగిని మోసగించిన సైబర్ నేరగాళ్లు !

Telugu Lo Computer
1


హైదరాబాద్ నగరానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి వివాహం చేసేందుకు ఇటీవల వారి సామాజికవర్గానికి చెందిన ఓ వెబ్‌సైట్ లో ఇద్దరి అమ్మాయిల వివరాలను పోస్ట్‌ చేశారు. ఓ వ్యక్తి పెద్ద కుమార్తె నచ్చిందని మాట కలిపాడు. మరుసటి రోజు మీ చిన్న కుమార్తెను మా పెద్దన్నయ్య కొడుకుకి ఇస్తారా? ఒకటే చోట ఇద్దరూ కలసి ఉంటారంటూ నమ్మించారు. ఎట్టకేలకు ఒకటేసారి ఒకే కుటుంబానికి చెందిన వారి పెళ్లి సంబంధం రావడంతో ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. వారం రోజుల పాటు ఇరువైపులా కేవలం ఫోన్‌ల ద్వారానే మాటలు సాగాయి. ముందుగా సంప్రదించిన వ్యక్తి తన కుమారుడు అర్జెంటుగా యూఎస్‌కు వెళ్లాలి, త్వరగా పెళ్లి చేద్దామనే ప్రపోజల్‌ పెట్టాడు. ఇద్దరి అమ్మాయిలకు సంబంధించి ముందుగానే నిశ్చితార్థం పెట్టుకుందామని డబ్బు కావాలని కోరాడు. అతగాడి మాటలు నమ్మిన ఆ తండ్రి పలు దఫాలుగా రూ.26 లక్షలు ముట్టచెప్పారు. అడిగినంత ఇస్తూనే ఉన్నాడు కానీ పెళ్లి చూపులకు ఇంటికి మాత్రం రావడం లేదు. వారి సామాజిక వర్గానికి చెందిన వెబ్‌సైట్‌లో ఆరా తీయగా, మీరు చెప్పిన వివరాలతో మా వెబ్‌సైట్‌లో ఎవరూ లేరనే విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. తన ఇద్దరి కుమార్తెల భవిష్యత్‌ను కాపాడాలని, దోచుకున్న డబ్బును ఇప్పించాలంటూ ఆ వృద్ధుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ చెప్పారు.

Post a Comment

1Comments

  1. ఇంత తెలివితక్కువగా ఎలా ఉంటారు జనాలు?

    ReplyDelete
Post a Comment