అమిత్ షాకు నేనంటే భయం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కొత్త సెక్రెటేరియట్ ఒవైసీ ఆనందం కోసమే అనడం హాస్యాస్పదంగా ఉంది. నా ఆనందం కేవలం మసీద్‌లోనే ఉందని  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  అన్నారు. గుజరాత్‌లోని ఓ హనుమాన్ మందిరం నమూనా ఆధారంగానే తెలంగాణ కొత్త సెక్రెటేరియట్ నిర్మించారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ మజ్లిస్ పేరు జపం చేయటమే పనిగా పెట్టుకుందని ఒవైసీ విమర్శించారు. మసీదు కూల్చిన చోట కొత్తది నిర్మించలేదు కానీ సెక్రెటేరియట్ పూర్తయింది. గచ్చిబౌలిలో ఇస్లామిక్ సెంటర్ ఇంతవరకు ఏర్పాటుచేయలేదు. కానీ బ్రాహ్మణ్ సదన్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో ఆలయాలకోసం 2500 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో రామ మందిరాలు నిర్మిస్తామన్నాడని ఒవైసీ అన్నారు. నా పేరు చెప్పుకొని తెలంగాణలో బీజేపీ పబ్బం గడుపుకోవాలనుకుంటే నాకు అభ్యంతరంలేదు. అయితే, అమిత్ షాకు తెలుసు ఒవైసీ ఇస్లాం ధార్మికుల సేవకుడని అందుకే ఆయనకు నేనంటే భయం. మజ్లిస్‌ను బలహీనం చేసే శక్తి దేశంలో ఎవరికీ లేదని ఒవైసీ అన్నారు. తెలంగాణ సెక్రెటేరియట్‌పై బీజేపీ జెండా ఎగరబోదు. అమిత్ షా చెప్పులు మోసే బీజేపీ నాయకులు కూడా మజ్లిస్ పై మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిమ్ ల అభివృద్ది నిధులపై ఏడ్చేవారు, వారి తండ్రి, తాతల ఆస్తులిస్తున్నారా అంటూ ఒవైసీ ప్రశ్నించారు. మేం పోటీచేయకుంటేనే బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది. రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో త్వరలో వెల్లడిస్తాం అని ఒవైసీ చెప్పారు. కొత్త లోక్‌సభలో ప్రధాని వెంట హిందూ పూజారులే ఉన్నారు. ముస్లిం, క్రైస్తవ, సిఖ్ ధర్మ ప్రముఖులను ఎందుకు పిలవలేదు అని ఒవైసీ ప్రశ్నించారు. కొత్త లోక్‌సభ ప్రారంభోత్సవంలో ప్రజాస్వామ్యం ప్రతిబింబించలేదు, రాజరిక రాజ్యాభిషేకం ప్రతిబింబించిందని అన్నారు. మక్కా మసీద్ మౌల్వీ తుర్రేబాజ్ ఖాన్ కాలాపానీ జైలుకెళ్ళిన తొలి తెలంగాణా బిడ్డ. పాకిస్తాన్ ప్రేమికులు ఆ దేశానికెళ్ళారు, ఇక్కడున్నవారందరూ దేశ ప్రేమికులు. ద కేరళ స్టోరీ సినిమాను ప్రధాని మోడీ అభినందించారు. మోడీని మించిన నటులెవరూ లేరు. తొమ్మిదేళ్లుగా అద్భుతంగా నటిస్తున్నారంటూ ఒవైసీ విమర్శించారు. కాంగ్రెస్ అస్తిత్వం కోల్పోతోంది. ఆ పార్టీని అందరూ వీడుతున్నారు. ఆ పార్టీ లో ఒవైసీ లాంటి మొగాడెవరూ లేరా అంటూ ప్రశ్నించారు. హజ్‌కు వెళ్ళేవాళ్ళపై కాంగ్రెస్ హయాంలోనే రాళ్ళు రువ్వారని ఒవైసీ అన్నారు. గో రక్షకుల పేర దౌర్జన్యాలు చేస్తున్నవారు రాక్షసులని అన్నారు. కారు స్టీరింగ్ నా చేతిలో ఉందంటున్నారు. దురదృష్టవశాత్తూ యాక్సిండెంట్ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌లో ఉర్దూ మీడియం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఎందుకు ఏర్పాటుచేయలేదని ఒవైసీ ప్రశ్నించారు. రిమ్స్‌లో ఉద్యోగాల కొరకు లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కేవలం మున్నూరు కాపులకేనా లేక అందరికీ ఉద్యోగాలిప్పించే ఉద్దేశముందా అంటూ ఒవైసీ ప్రశ్నించారు. మున్నూరుకాపు, ముదిరాజ్‌లు పార్టీని బలపరుస్తున్నందుకు బీజేపీ వారు సంబరపడుతున్నారు, చూద్దాం వారి సంబరం ఎన్నిరోజులో అంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్, తెలంగాణ శాంతి మాకు ముఖ్యం. మసీదులను బాగుచేయండి, ఉల్మాలను గౌరవించండి అని ఒవైసీ అన్నారు. ఆదిలాబాద్‌లో ముస్లింల ఓట్లు 60 వేలు ఉన్నాయి. మా సమస్యలు తీర్చకుంటే వచ్చే ఎన్నికల్లో మేం ఎవరిని పట్టించుకోమని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)