ఎన్నికలు ముగిసే వరకు జనగణన లేనట్టే !

Telugu Lo Computer
0


జాతీయ జనగణన 2020లో జరగాల్సింది. కానీ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ ఇప్పటికే మూడేళ్లే పూర్తైంది. అయితే ఈ ఏడాది కూడా ఇది జరగనట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు కష్టమేనని అధికారులే అంటున్నారు. ఇప్పటికే ఇది మూడేళ్లు ఆలస్యమైంది. అధికారులు చెబుతున్నది చూస్తుంటే మరో ఏడాదికి పైగా సమయం పట్టేలా ఉంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ ''2020 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సెన్సస్‌ (కులగణన) నిర్వహించాల్సి ఉంది. కానీ కొవిడ్ రావడంతో వాయిదా పడింది. దీనిపై కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. పాలనపరమైన పరిధులు, కొత్త జిల్లాల లెక్కల వంటి వాటిపై తుది నిర్ణయానికి వచ్చే తేదీని ఈ ఏడాది జూన్ 30గా రిజిస్ట్రార్‌ జనరల్‌-సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం జనవరిలో స్పష్టం చేసింది. సాధారణంగా ఆ తేదీ ప్రకటించిన మూడు నెలలకు గానీ సెన్సస్‌ను ప్రారంభించటం కుదరదు. అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ సాధ్యం కాదు. ఆ తర్వాత జనగణన నిర్వహించే 30 లక్షల మంది ఉద్యోగుల శిక్షణకు కనీసం మరో రెండు నుంచి మూడు నెలల కాలం పడుతుంది. ఆ సమయానికి సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రక్రియ మొదలవుతుంది. ఈ ఏడాది అక్టోబరు నుంచి సిబ్బందికి ఈసీ పనుల కారణంగా జనగణనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు జనాభా లెక్కలు సాధ్యం కాదు'' అని తేల్చి చెప్పారు. కాగా, ప్రభుత్వ సిబ్బంది వివరాలు సేకరించడం కంటే, ప్రజలే తమ వివరాలను సెన్సన్‌ దరఖాస్తులో స్వయంగా నింపేలా జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) హక్కును కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సస్‌ జరిగినప్పుడు మాత్రం అందులో కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ వివరాలు, ఇంటర్నెట్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లు, కార్లు, ద్విచక్రవాహనాలు, ప్రధాన ఆహారంవంటి 31 ప్రశ్నలకు సమాధానాల్ని సేకరించనున్నారని అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)