తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్నఎండలు !

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతుంది. దానికి తోడు వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం నుంచే బయటికి రావడానికి భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైనే ఉంటుందని పేర్కొంది. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత భారీగా పెరిగినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపుగా 45 డిగ్రీలకు చేరింది. బాపట్లలో గరిష్ఠంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగ్గయ్యపేటలో 44.7 డిగ్రీలు, పోలవరంలో 44.6 డిగ్రీలు, ప్రకాశంలో 44.5, ఏలూరులో 44.56, గుంటూరులో 44.4, కాకినాడ 44.28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కోనసీమలో 44.2, అల్లూరిలో 43.7, పలనాడులో 44.21, నెల్లూరులో 44.09, కృష్ణాలో 44, పశ్చిమ గోదావరిలో 43.8, తిరుపతిలో 44.08, శ్రీకాకుళంలో 43.82, తూర్పు గోదావరిలో 43.7, కడప 42.8, విజయనగరంలో 42.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వచ్చే 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 46 డిగ్రీల వరకూ చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందట. రానున్న 2-3 రోజులు ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)