రెండు తెలుగు రాష్ట్రాల మధ్య హై స్పీడ్ కారిడార్లు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రస్తుతం నల్గొండ, గుంటూరు మీదగా ఒక మార్గం, వరంగల్, ఖమ్మం మీదగా మరో మార్గం అందుబాటులో ఉన్నాయి. రెండూ రద్దీగానే ఉంటాయి. వరంగల్ మార్గంలో ట్రాక్ గరిష్ట సామర్థ్యం 150 కిలోమీటర్లుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులను హైస్పీడ్ రైలు కారిడార్ ద్వారా అనుసంధానం చేయాలని భారత రైల్వే భావిస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదగా విశాఖపట్నం, కర్నూలు నుంచి విజయవాడకు ఈ హైస్పీడ్ కారిడార్లు ఉండేలా రైల్వేశాఖ ప్రణాళికలు రచిస్తోంది. 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించి ఇంజనీరింగ్, ట్రాఫిక్ అధ్యయనం కోసం రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. త్వరలోనే సంస్థను ఎంపిక చేయబోతున్నారు. హైస్పీడ్ రైలు ఏ మార్గంలో ఉంటే లాభదాయకంగా ఉంటుంది అనే విషయంలో ఈ సంస్థ 6 నెలల్లో నివేదిక అందజేస్తుంది. ఇది అందిన తర్వాతే అంచనా వ్యయం ఎంతనేది స్పష్టత వస్తుంది. హైదరాబాద్-విశాఖపట్నం మార్గాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభిస్తారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు చెందినవారంతా అంతర్జాతీయ విమానాశ్రయంతో కనెక్టవుతారని రైల్వే భావిస్తోంది. మొత్తం మూడు మార్గాలపై సర్వే జరగనుంది. వరంగల్, ఖమ్మం మీదగా విజయవాడకు, నల్గొండ, గుంటూరు మీదగా విజయవాడకు, సూర్యాపేట హైవే మీదగా ఉండే మార్గాల్లో ఏ మార్గమనేది సర్వే పూర్తయిన తర్వాత తెలియనుంది. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు విజయవాడకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు కారిడార్ వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. దురంతో 10.30 గంటలు, వందే భారత్ 8.30 గంటల సమయంలో విశాఖకు చేరుకుంటున్నాయి. హైస్పీడ్ కారిడార్ కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు కేవలం నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)