నీరాకు కల్లుకు తేడా ఏంటి ?

Telugu Lo Computer
0


తెలంగాణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలో  నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి 20 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. కేఫ్‌ చుట్టూ తాటి చెట్లతో పల్లె వాతావరణాన్ని సృష్టించారు. నీరా కేఫ్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ఇక్కడ నీరాతోపాటు నీరా బూస్టు, షుగర్‌, హనీ, ఐస్‌క్రీమ్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వీటితోపాటు రెస్టారెంట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌తో కొన్ని స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. చాలా మంది నీరా, కల్లు ఒక్కటేని అనుకుంటారు. కానీ నీరా, కల్లు ఒక్కటి కాదు. నీరాలో ఆల్కాహాల్ ఉండదు. కల్లులో ఆల్కాహాల్ ఉంటుంది. తాటి, ఈత, కొబ్బరి, ఖర్జూరం, జీలుగు వంటి చెట్లు స్రవించే సహజ సిద్ధమైన ద్రవమే నీరా. ఇందులోని సహజ చక్కెరలు అలాగే ఉంటే దానిని నీరా అంటారు. అందులోని చక్కెర ఆల్కాహాల్‌గా మారితే అప్పుడు కల్లు అవుతుంది. నీరాను సూర్యోదయానికి ముందే తీయాలి. ఎండపడి ఉష్ణోగ్రత మరో ఆరు డిగ్రీలు పెరిగితే అది పులిసిపోయి.. కల్లుగా మారుతుంది. నీరాను తీసేందుకు గీత కార్మికులు శుభ్రమైన కుండను చెట్లకు కడుతుంటారు. ఉదయాన్నే దానిని చెట్టు నుంచి సేకరించి విక్రయిస్తారు. ఒకవేళ కల్లు తీయాలంటే మాత్రం  కుండ లోపల ఈస్ట్‌ కలుపుతారు. కుండలో నీరా పడిన తర్వాత.. అందులోని చక్కెరను ఈస్ట్ కల్లుగా మార్చుతుంది. ఎండ పెరిగే కొద్ది ఈ కల్లు కూడా పులుపుగా మారుతుంది. కల్లులో ఆల్కాహాల్ శాతం ఉండడం వల్ల మత్తు వస్తుంది. అందువల్ల కల్లును తాగేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ నీరాను మాత్రం పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తాగవచ్చు. కొబ్బరి నీళ్లలాగే తియ్యగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. నీరా ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. తాడి చెట్లతో పాటు ఈత, కొబ్బరి, ఖర్జూర, జీలుగ చెట్ల నుంచి కూడా నీరా వస్తుంది. ఇందులో ఎన్నో రకాల ఔషధగుణాలున్నాయి. నీరా అనేక వ్యాధులను నుండి కాపాడుతుంది.  పిల్లలు బాగా ఎదుగుదల, ఎముకల పటుత్వానికి దోహపడపడుతుంది. వృద్ధుల్లో కాళ్లు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. వాంతులు, విరోచనాలు, కామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులను దరిచేరనివ్వదు. ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ, అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు పెరుగుతుంది. నీరాతో కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. క్యాన్సర్ కారకాలైన ప్రిరాడికల్స్ ప్రభావం తగ్గుతుంది. నీరా రెగ్యులర్‌గా తాగితే చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖం మరింత కాంతివంతమవుతుంది. మధుమేహ వ్యాధి ఉన్న వారు కూడా ఎలాంటి భయం లేకుండా నీరాను తాగవచ్చు. డయాబెటిస్ నియంత్రణకు ఇది దోహదపడుతుంది. శ్వాస సమస్యలను కూడా తగ్గిస్తుంది. తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు నీరాను హెల్త్ డ్రింక్‌గా విక్రయిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా నీరాను విక్రయించనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)