అసత్య ప్రచారంపై న్యాయ పరంగా పోరాటం చేస్తా !

Telugu Lo Computer
0


వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎంపీ అవినాస్, వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డిని సీబీఐ విడతల వారీగా విచారణ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాంను సీబీఐ విచారణ చేసిందని, ఆయన ఏం చెప్పారనే కోణంలో కధనాలు ప్రచురితం అయ్యాయి. దీని పైన సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం స్పందించారు. సీబీఐ విచారణకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. అజయ్ కల్లాం 2019 ఎన్నికల సమయం నుంచి జగన్ కోసం పని చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వివేకా కేసులో అజయ్ కల్లంను సీబీఐ సమాచారం కోసం ఆరా తీయటం చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లం చెప్పుకొచ్చారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ నా నుంచి కొన్ని వివరాలు తీసుకోవటం వాస్తవమని వివరించారు. కేవలం సమాచారంగా మాత్రమే ఆ వివరాలు సీబీఐ సేకరించిందని అజయ్ కల్లం పేర్కొన్నారు. మేనిఫెస్టో సమావేశంలో ఉండగా వివేకా నోమోర్ అనే విషయం మాత్రమే తనకు తెలిసిందని స్పష్టం చేసారు. ఎలా చనిపోయారన్న వివరాలను తానేమీ సీబీఐకి చెప్పలేదని అజయ్ కల్లాం చెప్పారు. తాను వివేకా ఎలా చనిపోయారో..ఎవరి పేరునో ప్రస్తావించి చెప్పినట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సీబీఐ లీకులు ఇవ్వటం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను చెప్పిన అంశాలను వక్రీకరిస్తున్నారని సీరియస్ అయ్యారు. తాను సీబీఐకి గుండెపోటు అని చెప్పినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు. విచారణ పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చేవారిపైన సీబీఐ చర్యలు తీసుకోవాలని అజయ్ కల్లాం డిమాండ్ చేసారు. లీక్ పేరుతో డ్రామా అడుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టో కమిటీ సమావేశంలో తన గురువు అయిన ఉమ్మారెడ్డి అడిగినందుకు వెళ్లాలనని చెప్పుకొచ్చారు. దీనికి వివేకా హత్యకు లింకు పెట్టటం సరి కాదన్నారు. తనపై చేస్తున్న అసత్య ప్రచారంపై న్యాయ పరంగా పోరాటం చేస్తానని అజయ్ కల్లం స్పష్టం చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)