జంతు హింస చట్టం జల్లికట్టు క్రీడకు వర్తించదు !

Telugu Lo Computer
0


తమిళవాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై తమిళవాడు చట్టాన్ని సుప్రీం కోర్టు గురువారం సమర్ధించింది. జంతు హింస చట్టం ఈ క్రీడకు వర్తించదని తెలియజేసింది. 2014లో ఈ క్రీడపై సుప్రీం కోర్టు ఇచ్చి తీర్పును తాజాగా సవరించింది. తమిళనాడు లోని జల్లికట్టు, కర్ణాటకలో కంటల, మహారాష్ట్రలో ఎడ్లబళ్ల పోటీల నిర్వహణకు అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధమేనని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. జంతువులపై క్రూరత్వనిరోధక చట్టానికి ఈ రాష్ట్రాలు సవరణ చేయడాన్ని సమర్ధించింది. తమిళ సంస్కృతిలో జల్లికట్టు ఓ భాగమని ఆ రాష్ట్రప్రభుత్వం తెలియజేసిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. తమిళనాడులో పొంగల్ పండగ సమయంలో జల్లికట్టు ఆట ఆడడం సంప్రదాయంగా వస్తోంది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 2014లో సుప్రీం కోర్టు నిషేధం విధించింది. యానిమల్ వెల్ఫేర్‌బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏ నాగరాజు అండ్ అదర్స్ కేసులో సుప్రీం కోర్టు 2014లో తీర్పు చెబుతూ జల్లికట్టు వంటి కార్యకలాపాలను నిషేధించింది. ఈ క్రీడ జంతువులపై 1960 నాటి హింస నివారణ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుందని అప్పుడు కోర్టు పేర్కొంది. అయితే ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఆందోళనలు సాగాయి. ఈ సమయంలోనే జల్లికట్టును ప్రివెన్షన్ ఆప్ క్రూయల్టీ టు యానిమల్స్ చట్టం నుంచి తొలగిస్తూ 2016 లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత 2017లో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుకూలంగా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ చట్టానికి సవరణలు చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులోఅనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గత ఏడాది సుప్రీం కోర్టు విచారణ జరిపింది. హింస ఉన్నంత మాత్రాన నెత్తుటి క్రీడ అనలేమని వ్యాఖ్యానించింది. తరువాత తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో రాష్ట్రాలు చేసిన సవరణలు సరైనవేనని చెప్పింది.ఈ సవరణలను " కలరబుల్ లెజిస్లేషన్స్‌" అని చెప్పలేమని పేర్కొంది. భారత రాజ్యాంగం లోని ఏడో షెడ్యూల్ , రెండో జాబితా లోని 17 వ ఎంట్రీ ప్రకారం ఈ సవరణలను చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి ,జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్ , జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)