'ది కేరళ స్టోరీ' నిషేధంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు !

Telugu Lo Computer
0


'ది కేరళ స్టోరీ' చిత్ర ప్రదర్శనను నిషేధించడంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు పంపింది. నిషేధానికి కారణం ఏమిటని ప్రశ్నించింది. దేశమంతటా సినిమా ప్రదర్శన జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్‌లో నిషేధం విధించడానికి కారణం కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్‌లో చిత్ర పదర్శనను నిలిపివేయడంపై చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. ''దేశంలోని ఏ ఇతర ప్రాంతం కంటే పశ్చిమ బెంగాల్ భిన్నం కాదు. అలాంటప్పుడు సినిమా ప్రదర్శించడానికి పశ్చిమ బెంగాల్ ఎందుకు అనుమతించడం లేదు?'' అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజలు సినిమా చూడటం ఇష్టం లేకపోతే చూడటం మానిస్తారని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి హాజరయ్యారు. హింస, విద్వేష ఘటనలు చెలరేగకుండా చూడటం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా ఉండేందుకు 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని నిషేధిస్తున్నట్టు మే 8న మమతా బెనర్జీ ప్రకటించారు. కాగా, తమిమిళనాడులో 'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. ధియేటర్ల వద్ద తీసుకున్న భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రంపై నిషేధం విధించనప్పటికీ, శాంతిభద్రతల కారణాలతో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు తమిళనాడులోని ధియేటర్ల యజమానులు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)