ఇండియాలో తయారైన దగ్గు మందు కలుషితమైంది !

Telugu Lo Computer
0


ఓ భారతీయ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  తెలిపింది. మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో ఈ కలుషిత దగ్గు మందును గుర్తించినట్లు ప్రకటించింది. గత ఏడాది కొన్ని దేశాల్లో సంభవించిన పిల్లల మరణాలకు భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్‌లతో సంబంధం ఉన్న నేపథ్యంలో మరోసారి కలుషిత దగ్గు మందు తెరపైకి రావడం చర్చనీయంశంగా మారింది . మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో ఎవరైనా పిల్లలు ఈ దగ్గు మందుతో మృతి చెందారా లేక అనారోగ్యంతో ఉన్నారో లేదో డబ్ల్యూహెచ్ఓ  వెల్లడించలేదు. అయితే, దిగుమతి చేసుకున్న దగ్గు సిరప్‌లోని ఒక బ్యాచ్‌లోని నమూనాలు పరిశీలించగా.. గ్వైఫెనెసిన్ సిరప్ టీజీ  సిరప్ లో అధిక మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌ ఉన్నట్లు పేర్కొంది. ఇవి మానవులకు విషపూరితమైనవి, ప్రాణాంతకంగా మారగలవని తెలిపింది. కాలుష్యాన్ని ఆస్ట్రేలియా రెగ్యులేటర్, థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించిందని వివరించింది. పంజాబ్‌కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్‌ లిమిటెడ్‌ ఈ దగ్గు మందును తయారు చేసిందని పేర్కొంది. ఈ దగ్గు మందును హరియాణాకు చెందిన థ్రిల్లియం ఫార్మా మార్కెటింగ్‌ చేస్తోందని తెలిపింది. గతంలో భారత్, ఇండోనేషియాలోని తయారు చేసిన ఈ సిరప్‌లు గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్‌లలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులకు దారితీశాయి. ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 300 కంటే ఎక్కువ మంది పిల్లల మరణించినట్లు వార్తలు వచ్చాయి. డబ్య్లూహెచ్ఓ ప్రటనపై క్యూపీ ఫార్మాకెమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ పాఠక్ స్పందించారు. స్థానిక రాష్ట్ర డ్రగ్ రెగ్యులేటర్ ఆదేశాలను అనుసరించి ఎగుమతి చేసిన బ్యాచ్ నుంచి నమూనాను పరీక్షించినట్లు చెప్పారు. మందు సరిగానే ఉన్నట్లు రెగ్యులేటర్ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. 18,000 బాటిళ్ల సిరప్‌ను కంబోడియాకు మాత్రమే ఎగుమతి చేసేందుకు క్యూపీ ఫార్మాకెమ్‌కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని పాఠక్ చెప్పారు. మార్షల్ దీవులు, మైక్రోనేషియాలో సిరప్ ఎలా వెళ్లిందో తెలియదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)