మహాదేవ్ ఆలయంలోని అక్రమ కట్టడం కూల్చివేత !

Telugu Lo Computer
0


శ్రీరామనవమి వేడుకల్లో  50 అడుగుల మెట్ల బావి  పైకప్పు కూలి 35 మంది దుర్మరణం పాలైన ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఘటన చోటుచేసుకున్న బలేశ్వర్ జూలేలాల్ మహాదేవ్ ఆలయంలోని అక్రమ కట్టడాన్ని స్థానిక అధికార యంత్రాంగం భారీ పోలీసు భద్రత మధ్య సోమవారంనాడు కూల్చివేసింది. విగ్రహాలను మరో మంందిరానికి తరలించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆలయ ఆవరణలో పోలీసు భద్రత మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ మొదలైంది. ఆలయ ప్రాంగణంలో 10,000 చదరపుటడుగుల భూమి ఆక్రమణకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు. కూల్చివేతలకు స్థానికుల నుండి ఎలాంటి నిరసనలు, అవాంతారాలు తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు. విగ్రహాలను కాంతఫాడ్ ఆలయానికి తరలించి యథాప్రకారం పూజాదికాలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గత గురువారంనాడు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. వేడుకల్లో భాగంగా హవనం నిర్వహించారు. కార్యక్రమం జరుగుతుండగా ఆలయంలో ఉన్న 50 అడుగుల మెట్ల బావి వైకప్పుపై భక్తులు నిల్చున్నారు. దీంతో పైకప్పు కుప్పకూలి 50 మంది భక్తులు బావిలో పడిపోయారు. వీరిలో 35 మంది మృతి చెందగా, తక్కినవారు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఎన్డీఆర్ఎప్ బృందం నిచ్చెనల సాయంతో బావిలో పడిన వారిని కాపాడే ప్రయత్నం చేసింది. మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సీఎంతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై మహాబలేశ్వర్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు, కార్యదర్శిపై ఎఫ్ఐఆర్‌పై నమోదు చేశారు. మెట్ర బావిపై రూఫ్‌ విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని వారిపై కేసు నమోదు చేశారు. టెంపుల్ కాంప్లెక్స్‌లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించినప్పటికీ ట్రస్టు తమ ఆదేశాలను పాటించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)