సీఎం కన్యా వివాహ్‌ యోజన పథకంలో వధువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని డిండౌరి జిల్లా గాడాసరయీ పట్టణంలో 'ముఖ్యమంత్రి కన్యా వివాహ్‌ యోజన' పథకంలో భాగంగా శనివారం 219 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్న యువతులకి గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో నలుగురు యువతులు గర్భవతి అని తేలడంతో వారిని వివాహం చేసకునేందుకు అనుమతించలేదు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఏ నిబంధన కింద ఆ యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారంటూ ప్రశ్నించింది. ఇది పేదలను అవమానించడమేనని విమర్శించింది. సుమారు 200 మంది మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. అయితే మరోవైపు ఈ విమర్శలను డిండౌరి కలెక్టర్‌ వికాశ్‌ మిశ్ర ఖండించారు. సామూహిక వివాహాల కార్యక్రమంలో పెళ్లి చేసుకునే యువతులకు సికిల్ సెల్ (రక్తహీనత) పరీక్షలు నిర్వహించాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా కొందరు యువతులు తమకు పీరియడ్‌ సంబంధిత సమస్యలు ఉన్నాయని వెల్లడించారని చెప్పారు. దీంతో వారికి వైద్యులు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలుగురు గర్భిణులని తేలిందన్నారు. అయితే ఈ కార్యక్రమంలో వివాహం చేసుకునే యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే నిబంధన లేదని వికాశ్‌ మిశ్ర స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో 'ముఖ్యమంత్రి కన్యా వివాహ్‌ యోజన'లో పెళ్లి చేసుకునే జంటకు రాష్ట్ర ప్రభుత్వం రూ.56 వేల ఆర్థిక సహాయం కూడా అందజేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)