వీడని ప్రమీల హత్య కేసు మిస్టరీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కదిరిలో భర్త మృతితో ఇంట్లోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని ప్రమీల ఒంటరిగా జీవనం సాగిస్తోంది. 13 నెలల క్రితం తన కిరాణా దుకాణంలోనే ఆమె హత్యకు గురైంది. పలుమార్లు కత్తితో పొడిచినట్లుగా ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఘటన జరిగి ఏడాదికి పైగా అయినా నేటికీ హత్య వెనుక మిస్టరీ వీడలేదు. ఈ హత్య జరిగి 13 నెలలు పూర్తయినా నేటికీ దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించలేదు. ఇంత వరకూ నిందితులు ఎవరనేది తేల్చలేదు. కాగా, ఈ హత్య వెనుక గతంలో ఇక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి పాత్ర ఉండడం వల్లనే దర్యాప్తులో పోలీసులు జాప్యం చేస్తున్నారని హతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంగా ఎస్పీ మాధవరెడ్డిని కలసి విన్నవించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. హత్యకు గురైన ప్రమీల శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేస్తోంది. సమీప బంధువులతో ఆస్తి తగాదాలు నెలకొనడంతో పరిష్కారం కోరుతూ తరచూ ఆమె కదిరి పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళుతుండేది. ఈ క్రమంలోనే అప్పటి ఓ పోలీస్‌ అధికారి ఆమె అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని లోబర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. హత్య జరిగిన తర్వాత ఆమె సెల్‌ఫోన్‌ కాల్స్‌ పరిశీలించిన బంధువులు తరచూ సదరు పోలీస్‌ అధికారితో ప్రమీల మాట్లాడినట్లుగా పేర్కొంటున్నారు. ఈ కారణంగానే సదరు పోలీసు అధికారిని అప్పట్లో విధుల నుంచి తప్పించినట్లుగా పోలీసు వర్గాలూ చెబుతున్నాయి. త్వరలో ఈ కేసులోని మిస్టరీని ఛేదిస్తామని కదిరి డీఎస్పీ భవ్యకిషోర్‌ అన్నారు. హత్య వెనుక పోలీసుల పాత్ర ఉన్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)