దేశంలో కొత్తగా 7,830 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడచిన 24 గంటల్లో 7,830 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. దాదాపుగా గడచిన 223 రోజుల గరిష్టానికి తాజా కరోనా కేసుల సంఖ్య చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 40,215 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో మంగళవారం ఒక్కరోజే 16మంది మృతి చెందారు. ఢిల్లీ, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కరుచొప్పున మృతి చెందారు. అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే ఐదుగురు కరోనాకు బలయ్యారు. తాజా మరణాలతో కలిసి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మృతి చెందిన కరోనా మృతుల సంఖ్య 5,31,016కి చేరింది. క్రితంరోజు 5,676 కరోనా ఇన్ఫెక్షన్ల కేసులు నమోదవ్వగా.. ఒక్కరోజులోనే రెండువేలకు పెరిగి ప్రస్తుతం 7 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,47,76,002 కేసులు నమోదయ్యాయి. ఇక తాజా కేసుల్లో 1,774 కేసులు ఎక్స్‌బిబి1.16 వేరియంట్‌కు సంబంధించినవని.. వీటిని 22 రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కనుగొన్నట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్‌ఎస్‌ఎసిఓజి) తెలిపింది. ఇక 230 మంది ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బిబి 1.16.1కి బారినపడినట్లు ఐఎన్‌ఎస్‌ఎసిఓజి పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా కేంద్రం 220.66 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)