పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ అదే ప్రతిష్టంభన

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ అదానీ వ్యవహారంపై ప్రతిష్టంభన తొలగడం లేదు. ఇదే అంశంపై అధికార, ప్రతిపక్షాలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నాయి. అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టగా, లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ  క్షమాపణలు చెప్పాలని అధికార భాజపా  డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చోపచర్చలు లేకుండా ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు అదానీకి అధికార భాజపా వత్తాసు పలుకుతోందంటూ ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌ ఎదుట మానవహారంగా ఏర్పడ్డారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నేతృత్వంలో భావసారూప్యత కలిగిన పార్టీలనాయకులంతా ఏకమయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజ్యసభ వెల్‌లోకి దూసుకొచ్చారు. నలుపు రంగు దుస్తులు ధరించి, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అదానీ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటు చేయాల్సిందిగా విపక్ష నేతలు పట్టుబట్టారు. నల్లదుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి, భాజపా మంత్రులు, ఎంపీలు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకునేందుకు ప్రతిపక్షానికి అర్హత లేదా?అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవ్వడంతో ఉభయసభలూ రేపటికి వాయిదా పడ్డాయి. సభల ప్రారంభానికి ముందు.. భావసారూప్యత గల పార్టీల నాయకులంతా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేను పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిశారు. డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ, శివసేన, జేడీయూ, జేఎమ్‌ఎమ్‌, ఎండీఎంకే, ఆప్‌, వీసీకే, ఐఎంయూఎల్‌ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. అదానీ విషయంలో విచారణకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలన్నీ పట్టుబడుతుండటంతో.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించాలనే కుట్రతోనే భాజపా నాయకులంతా రాహుల్‌ క్షమాపణలు చెప్పాలంటూ కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)