గవర్నర్‌ హిందీ ప్రసంగాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యేలు !

Telugu Lo Computer
0


మేఘాలయ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. మార్చి 20వ తేదీ సోమవారం ఆ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్‌ హిందీలో ప్రసంగిస్తుండగా, వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో మేఘాలయ రాష్ట్ర ప్రధాన భాషలు ఖాసి, గారో, జైంతియా, ఇంగ్లీష్‌లేనని, హిందీ కాదని, రాష్ట్ర జనాభాలో ఎక్కువ మందికి హిందీ అర్థంకాదని గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటూ నినాదాలు చేశారు. సమావేశాల్లో టెలివిజన్‌ ఫుటేజ్‌ల్లో కూడా విపిపి చీఫ్‌, నాంగ్‌క్రెమ్‌ ఎమ్మెల్యే ఆర్డెంట్‌ మిల్లర్‌ బసాయావ్‌మోయింట్‌ గవర్నర్‌ ప్రసంగాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లే కనిపిస్తుంది. హిందీ భాషపై అసెంబ్లీలో రసాభాస జరిగిన నేపథ్యంలో విపిపి ఎమ్మెల్యేలు సభను నుంచి వాకౌట్‌ చేసి బయటకు వెళ్లారు. అనంతరం బసాయావ్‌మోయింట్‌ మీడియాతో మాట్లాడుతూ... 'మేఘాలయ హిందీ మాట్లాడే రాష్ట్రం కాదు. భాష సమస్య వల్ల అస్సాంతో విడిపోవాలని మేఘాలయ ప్రజలు కోరుకుంటున్నారు. ఖాసి లేదా గారో భాషలను రాజ్యాంగం ప్రకారం 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్న మేఘాలయ ప్రజల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. గవర్నర్‌ మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌కు విరుద్ధం. మాకు అర్థంకాని భాషలో గవర్నర్‌ ప్రసంగించడాన్ని మేము ఖండిస్తున్నాం' అని ఆయన అన్నారు. మరోవైపు గవర్నర్‌ హిందీ భాషలో ప్రసంగించడాన్ని స్పీకర్‌ థామస్‌ ఎ సంగ్మా అనుమతించారు. అయితే గవర్నర్‌ ప్రసంగానికి అభ్యంతరం వ్యక్తంచేస్తూ అసెంబ్లీలో మరికొంతమంది ఎమ్మెల్యేలు లేచి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన ఈ ఘటనపైైె మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా స్పందించారు. గవర్నర్‌ హిందీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన లేచి నిలబడి 'గవర్నర్‌కు ఇంగ్లీష్‌లో మాట్లాడడం రాదు. అందుకే ఆయన హిందీలోనే మాట్లాడారు' అని ఆయన అన్నారు. గవర్నర్‌ అనువాద ప్రసంగం సభ్యులకు ఇప్పటికే సర్క్యులేట్‌ చేయడం జరిగిందని సిఎం తెలిపారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే 2018వ సంవత్సరంలో కూడా చోటుచేసుకుంది. అప్పటి గవర్నర్‌ గంగా ప్రసాద్‌ అసెంబ్లీలో హిందీలో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సంగ్మా, ఆయనతోపాటు అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబరీన్‌ లింగ్డో అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేస్తూ బయటకు వచ్చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)