అన్నవరంలో భక్తుల ఇక్కట్లు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రత్నగిరికి వచ్చే భక్తుల్లో 90 శాతం మంది సత్యనారాయణస్వామి వ్రతాలు తప్పనిసరిగా ఆచరిస్తారు. ఏటా ఏడు లక్షలకు పైగా వ్రతాలు జరుగుతుండగా రూ.30 కోట్లకు పైగా ఆదాయం దేవస్థానానికి సమకూరుతోంది. భక్తులకు వ్రతాల టిక్కెట్లు అమ్మే కౌంటర్లు పశ్చిమ రాజగోపురం వద్ద, రామాలయం వద్ద ఉన్నాయి. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో 70 శాతం మంది పశ్చిమ రాజగోపురం ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడి కౌంటర్‌లోనే భక్తులు ఎక్కువగా వ్రతాల టిక్కెట్లు కొనుగోలు చేస్తూంటారు. ఒక రోజులో స్వామివారి వ్రతాలు 5 వేలు జరిగితే ఈ కౌంటర్‌లో సుమారు 3,500 టిక్కెట్లు విక్రయిస్తారు. రామాలయం వద్ద కౌంటర్‌లో 1,500 టిక్కెట్ల అమ్మకాలు మాత్రమే జరుగుతాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న పశ్చిమ రాజగోపురం కౌంటర్‌ను మధ్యాహ్నం 12 గంటల తరువాత మూసివేస్తున్నారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల తరువాత వచ్చిన భక్తులు గత్యంతరం లేక రామాలయం వద్ద ఉన్న కౌంటర్‌కు పశ్చిమ రాజగోపురం పక్కన ఉన్నమెట్ల దారిన నడిచి వెళ్లి, అక్కడ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. తిరిగి పశ్చిమ రాజగోపురం వద్దకు వచ్చి, వ్రత మండపాలకు వెళ్లాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా 12 గంటల తరువాత వస్తుంటారు. ఆ సమయానికి పశ్చిమ రాజగోపురం వద్ద వ్రతాల కౌంటర్‌ మూసివేయడంతో వీరు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మధ్యాహ్నం 2 గంటల వరకై నా ఈ కౌంటర్‌ తెరచి ఉంచాలని వారు కోరుతున్నారు. ఇక్కడ విశ్రాంతి షెడ్డులో చిన్న షెడ్డు వేసి దానినే వ్రత టిక్కెట్లు విక్రయించే కౌంటర్‌గా మార్చారు. ఇక్కడ కౌంటర్‌ ఉందనే విషయం ఎవరైనా చెబితే తప్ప తెలియని పరిస్థితి. దీనిని గోపురం రోడ్డుకు ఎదురుగా ఏర్పాటు చేస్తే అందరికీ కనిపిస్తుందని భక్తులు భావిస్తున్నారు. గోపురం లోపల ఉన్న రూ.200 దర్శనం కౌంటర్‌ను కూడా వ్రతాల కౌంటర్‌తో కలిపి అందరికీ కనబడేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)