దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో టీ 20 సిరీస్‌ వెస్టిండీస్‌ కైవసం

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మూడో టీ 20లో సౌతాఫ్రికా ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటిస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్‌ (44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌కు తోడుగా.. ఐడెన్‌ మార్ర్కమ్‌ 18 బంతుల్లో 35 నాటౌట్‌ రాణించినప్పటికి సౌతాఫ్రికాను గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన దశలో సౌతాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ ఐదు వికెట్లతో రాణించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. తొలుత బ్రాండన్‌ కింగ్‌ 25 బంతుల్లో 36, నికోలస్‌ పూరన్‌ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్‌ 22 బంతుల్లో 44 పరుగులు నాటౌట్‌, అల్జారీ జోసెఫ్‌ 9 బంతుల్లో 14 నాటౌట్‌ విధ్వంసం సృష్టించారు. 19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. స్ట్రైక్‌ తీసుకున్న షెపర్డ్‌ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన షెపర్డ్‌ వరుసగా నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు రావడంతో ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు బాదితే.. టార్గెట్‌లో సౌతాఫ్రికాకు ఆఖరి ఓవర్‌లో అదే 26 పరుగులు అవసరం అయ్యాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌ కాబట్టి ఒత్తిడి ఉండదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి ప్రొటిస్‌ విజయాన్ని దెబ్బతీసింది.ఈ విజయంతో వెస్టిండీస్‌ 2-1 తేడాతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్‌ జట్టు టి20 సిరీస్‌ను గెలవడం విశేషం. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్‌ నిలవగా, జాన్సన్‌ చార్లెస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)