అమృత ఫడ్నవీస్‌కు లంచం ఇచ్చేందుకు యత్నించిన మహిళకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు లంచం ఇవ్వజూపినందుకు, ఆమెను బెదిరించినందుకు అరెస్టయిన అనిక్ష జైసింఘానిని ముంబైలోని కోర్టు శుక్రవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆమె పోలీసు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది. అమృత ఫడ్నవీస్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 20న మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా మార్చి 16న అనిక్షను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.10 కోట్లను డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో రిమాండ్ ముగియడంతో పోలీసులు అనిక్షను సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడీ అల్మాలే ముందు హాజరుపరిచారు. పోలీసుల తరపున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మిసార్ మరో మూడు రోజుల కస్టడీని కోరారు. పోలీసు రిమాండ్ పొడిగింపునకు కొత్త కారణం ఏమీ లేదని అనిక్ష తరపు న్యాయవాది మనన్ సంఘై వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, విచారణాధికారుల విజ్ఞప్తిని తిరస్కరించి, నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసుకు సంబంధించి ఆమె తండ్రి, అనుమానిత బుకీ అనిల్ జైసింఘాని, వారి బంధువు నిర్మల్ జైసింఘానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ మార్చి 27 వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిపై కుట్ర, దోపిడీ, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, అనిక్ష గత 16 నెలలుగా అమృతా ఫడ్నవీస్‌తో టచ్‌లో ఉంది. ఆమె ఇంటికి కూడా వెళ్లింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అమృతా ఫడ్నవీస్ తాను నవంబర్ 2021లో అనిక్షను మొదటిసారిగా కలిశానని చెప్పింది. తాను బట్టలు, ఆభరణాలు, పాదరక్షల డిజైనర్ అని అనిక్ష పేర్కొంది. బహిరంగ కార్యక్రమాలలో వాటిని ధరించమని బీజేపీ నాయకుడి భార్యను అభ్యర్థించింది. ఇది తనకు ఉత్పత్తుల ప్రచారం చేయడంలో సహాయపడుతుందని అనిక్ష పేర్కొందని పోలీసులు చెప్పారు. అమృత నమ్మకాన్ని సంపాదించిన అనిక్ష.. కొంతమంది బుకీల సమాచారాన్ని అందజేస్తానని.. దాని ద్వారా వారు డబ్బు సంపాదించవచ్చని ఆమె పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, పోలీసు కేసులో తన తండ్రిని తప్పించడానికి ఆమె నేరుగా అమృతకు రూ.కోటి ఆశజూపింది. అమృత ఫడ్నవీస్ అనిక్ష ప్రవర్తనతో కలత చెంది ఆమె నంబర్‌ను బ్లాక్ చేసినట్లు పోలీసులకు చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)