టర్కీ, సిరియాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రశంసలు !

Telugu Lo Computer
0


వరుస భూకంపాలతో అల్లాడిపోయిన టర్కీ, సిరియాలకు హుటాహుటిన భారత దేశం చేయూతనందించింది. చకచకా సహాయక సిబ్బందిని, వైద్య, ఇతర పరికరాలు, మందులు వంటివాటిని పంపించింది. దీనికోసం మన దేశంలో వివిధ రంగాలకు చెందినవారు కర్తవ్య దీక్షతో పని చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది రాత్రంతా శ్రమించి పాస్‌పోర్టులను జారీ చేశారు. శీతల వాతావరణంలో ధరించే దుస్తులను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సమకూర్చింది. కొద్ది గంటల్లోనే అన్నిటినీ సిద్ధం చేసి బాధితులకు సహాయాన్ని అందజేయగలిగారు. ఆపరేషన్ దోస్త్ పేరుతో జరిగిన ఈ సహాయ కార్యక్రమాలు ముగిశాయి. సహాయాన్ని అందుకున్న దేశాలు, ప్రజలు కూడా భారత్ పట్ల కృతజ్ఞను ప్రకటిస్తున్నారు. ఆపరేషన్ దోస్త్ లో ఎన్డీఆర్ఎఫ్, భారత సైన్యం పాల్గొన్నాయి. ఫిబ్రవరి ఆరున భూకంపాలు సంభవించగా, అదే రోజు రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొలి సహాయక బృందాలు బయల్దేరాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేపట్టిన సహాయ కార్యక్రమాలు పూర్తిగా భావోద్వేగం, వృత్తి నైపుణ్యం, వ్యక్తిగత సవాళ్ళతో కూడుకున్నవి. ఎన్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నరేంద్ర బుందేల మంగళవారం విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం, అప్పటికప్పుడు పాస్‌పోర్టులను సిద్ధం చేయడానికి అధికారులు అవిశ్రాంతంగా పని చేశారు. 152 మందిని టర్కీ, సిరియాలకు పంపించాలనుకుంటే, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు లేవు. కొద్ది మందికి మాత్రమే విదేశీయానానికి పాస్‌పోర్టులు ఉన్నాయి. దీంతో వందలాది డాక్యుమెంట్లను కోల్‌కతా, వారణాసిలలోని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఫ్యాక్స్, ఈ-మెయిల్ ద్వారా పంపించాయి. అనంతరం 140 మందికి పాస్‌పోర్టులను సిద్ధం చేశారు. మొత్తం మీద 152 మంది బయల్దేరారు. ఢిల్లీలోని టర్కిష్ ఎంబసీ కూడా వీసా ఆన్ అరైవల్‌ను సిద్ధం చేసింది. ఎన్‌డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ మాట్లాడుతూ, సహాయకులను, వాహనాలను, ఇతర పరికరాలను టర్కీ, సిరియాలకు పంపించేందుకు మూడు సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలను రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. ఇతర దేశాల నుంచి టర్కీ వెళ్లిన సహాయక బృందాలను వెంటనే రంగంలోకి దించలేకపోయారని, దీనికి కారణం వారి వద్ద వాహనాలు లేకపోవడమేనని తెలిపారు. టర్కీకి చేరుకున్న మొదటి అంతర్జాతీయ సహాయక బృందాల్లో తమది కూడా ఒకటి అని తెలిపారు. తమ బృందాల వద్ద గుడారాలు, ఆహార పదార్థాలు, ఇంధనం ఉన్నాయని తెలిపారు. సబ్ ఇన్‌స్పెక్టర్ బింటు భోరియా మాట్లాడుతూ, తమ బృందాల్లోని సభ్యులు టర్కీలో 10 రోజులు సేవలందించారని, ఈ పది రోజుల్లో కనీసం స్నానం చేయడానికి అవకాశం లేకపోయిందని చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పాంజ్ బాత్ చేశారని, మలమూత్ర విసర్జన కోసం గోతులను తవ్వి, కప్పిపెట్టారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారి విపిన్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, తాము బస చేసిన అన్ని ప్రాంతాలను పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించి, శుభ్రపరచి వచ్చామని చెప్పారు. తాము స్వదేశానికి తిరిగి వచ్చేటపుడు కేవలం ఆ దేశస్థుల ఆత్మీయత, ప్రేమాభిమానాలను మాత్రమే తీసుకొచ్చామని చెప్పారు. తమవద్దనున్న టెంట్లు, ఆహారం, దుస్తులు, శీతల వాతావరణంలో ధరించే దుస్తులను స్థానికులకు, టర్కిష్ రెస్క్యూయర్స్‌కు ఇచ్చేశామన్నారు. కర్వాల్ మాట్లాడుతూ, టర్కీ ప్రజలు తమ పట్ల ఎంతో ఆత్మీయతను ప్రదర్శించారని చెప్పారు. అహ్మద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యుల మృతదేహాలను డిప్యూటీ కమాండెంట్ దీపక్ తల్వార్ వెలికి తీశారని, దీంతో అహ్మద్ ఎంతో అభిమానాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. దీపక్ కేవలం శాకాహారం మాత్రమే భుజిస్తారని, ఆ విషయాన్ని తెలుసుకున్న అహ్మద్ ఆయనకు ఆపిల్, టమాటా వంటి శాకాహారాన్ని మాత్రమే ఇచ్చేవారని తెలిపారు. దీపక్ విధుల్లో భాగంగా ఎక్కడికి వెళితే, అహ్మద్ కూడా ఆయనతోపాటు వెళ్లేవారని, ఆపిల్, టమాటా వంటివాటిని ఇచ్చేవారని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)